మచిలీపట్నం, ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి):-
జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో సామర్థ్యం పెంపుదల కోసం అవగాహన సదస్సుల
ను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో డి ఎల్ డి ఓ లతో సమావేశం నిర్వహించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు, పర్యవేక్షణ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు..
అవన్నీ సజావుగా అమలు అయ్యేందుకు గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ పటిష్టంగా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో 508 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయన్నారు.
వాటిల్లో అందిస్తున్న సేవలపై, కార్యకలాపాలపై కార్యదర్శులు అందరూ సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
ముఖ్యంగా ప్రజల నుండి అందే స్పందన అర్జీల పరిష్కారం పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో 1048 అసంతృప్త స్పందన అర్జీలు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు.
ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ఉందో విచారించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల్లో అసంతృప్తి తొలగిపోయే విధంగా పరిష్కారం ఉండాలని అందుకోసం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఉద్యోగుల్లో సామర్థ్యం పెంపుదల కోసం అవగాహన సదస్సులను ముమ్మరంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ పనితీరుపై జిల్లాస్థాయిలో కట్టుదిట్టంగా పర్యవేక్షణ ఉండాలన్నారు.
అర్జీదారులకు సమాధానం చెప్పేటప్పుడు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండరాదని వారి ప్రవర్తన సరళి ఎలా ఉండాలి అనే అంశం పైన వారికి సరైన అవగాహన కలిగించాలన్నారు.
స్పందన అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం ఉండాలన్నారు
ఏదైనా పథకం వర్తించకపోతే ఆ విషయం అర్థమయ్యే విధంగా సంబంధిత అర్జీదారులకు సవివరంగా తెలియజేయాలన్నారు.
సమస్య ఏమైనా ఉంటే సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు.
మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయం సందర్శించి అర్జీదారులను పిలిచి వారి అసంతృప్తి వివరాలను విచారించి వారిని సంతృప్తిపరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు
అంతేకాకుండా వచ్చిన దరఖాస్తులు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ అర్జీల పరిష్కారం ఉండాలన్నారు.
ఈ అంశాలపై గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలన్నారు
జిల్లాలోని 9606 క్లస్టర్ల వాలంటీర్లు గాను 9395 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న 211 వాలంటీర్ పదవులను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయుటకు ఏర్పాట్లు చేయాలన్నారు.
నెలకు రెండుసార్లుగా భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జి ఎస్ డబ్ల్యూ ఎస్ ఇన్చార్జి గుడివాడ డి ఎల్ డి ఓ సుబ్బారావు, మచిలీపట్నం డి ఎల్ డి వో పద్మ, జిల్లా సమన్వయకర్త రవికాంత్ పాల్గొన్నారు.
addComments
Post a Comment