*పరిశోధన ఫలితాలు రైతులకు అందించాలి
*
పార్వతీపురం, ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి): రైతులు అధిక దిగుబడి, ఆదాయం పొందేందుకు వారికి పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు ఎల్. ప్రశాంతి తెలిపారు. బుధవారం ఉద్యాన కళాశాలలో ఏర్పాటుచేసిన ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండల పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం నిర్వహించారు. పరిశోధన సంచాలకులు ఎల్. ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చింతపల్లి, సీతంపేట,రస్తకుటుంబాయి పరిశోధనా కేంద్రాలలో అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు, తెగుళ్ల నివారణ, సేంద్రీయ వ్యవసాయ పద్దతులపై పరిశోధనలు జరుగుతున్నాయని, పరిశోధన ఫలితాలను రైతులకు అందించి వారు మంచి ఫలితాలు సాధించుటకు రైతులను ఈ కార్యక్రమంలో భాగస్తులను చేస్తున్నట్లు తెలిపారు. సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని, సేంద్రీయ పంటలకు సర్టిఫికేషను చేసి మార్కెటు విలువ పెరిగేవిధంగా ప్రోత్సహించాలన్నారు. రసాయన ఎరువులతో అధిక దిగుబడి సాధించినా, సేంద్రీయ పద్దతులలో పండించిన పంటలలో అధిక పోషకాలు ఉంటున్నాయన్నారు. రసాయన ఎరువులు పరిమితికి మించివాడకూడదని, భూ పరీక్షలు నిర్వహంచి శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులోనే వినియోగించాలన్నారు. గిరిజన ప్రాంతాలలో సేంద్రీయ విధానంలో పండించే పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్మడం ద్వారా వారికి అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులకు ఎక్కువ ఆదాయం రావాలంటే డిమాండు గల పంటలను పండించాలని చింతపల్లిలో విదేశీపూల సాగుపై పరిశోధనలు సాగుతున్నాయని కొన్నిరకాల పూలను వాణిజ్యసరళిలో పండించుటకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలలో ప్రధాన పంటలైన రాజ్ మా వంటి పంటలలో అధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. అగ్రి టూరిజం అభివృద్ది చేయాలని, విద్యార్దులకు వ్యవసాయ క్రేత్రాలు సందర్శించే ఏర్పాట్లు చేయాలని, పాఠ్యాంశంగా చేర్చాలన్నారు.
చింతపల్లి పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టరు ఎం.సురేష్ కుమార్ చింతపల్లి, సీతంపేట,రస్తకుటుంబాయి పరిశోధనా కేంద్రాలలో నిర్వహిస్తున్న పరిశోధనలు గురించి వివరించారు. అధిక దిగుబడి నిచ్చే వంగడాలు, సేంద్రీయ సాగు విధానం, దేశవాళీ వంగడాలు, చిరుధాన్యాలు సాగు, సేంద్రీయ పద్దతులలో కలుపు నివారణ, కత్తెర పురుగు నివారణ, విదేశీపూల సాగు తదితర అంశాలలో పరిశోధనలు చేసి రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాజ్ మా, కందిలో అధిక దిగుబడి నిచ్చే నూతన వంగడాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రసాయన ఎరువులు వినియోగం పై పరిశోధనలలో దిగుబడి పెరిగినప్పటికి సేంద్రీయ విధానంలో సాగుచేసిన పంటల కంటే పోషకాలు తక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయుటకు సర్టిఫికేషను కొరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహస్తున్నామనిరైతులు వినియోగించుకోవాలని సూచించారు. కొర్ర,పెసర, వేరుసెనగ, వలిసె, కుసుమ,రాగి, మొక్కజొన్న, మినుము, సేంద్రీయ పద్దతులలో చెరుకు సాగు, నాణ్యమైన బెల్లం తయారీ, విదేశీపూల పెంపకం, తేనెటీగల పెంపకం, అల్లం, పశుగ్రాసం పంటలపై పరిశోధనలు చేసి ఫలితాలను రైతులకు అందిస్తున్నామన్నారు. మార్కెటులో డిమాండు గల విదేశీపూల సాగును వాణిజ్యసరళిలో పండించుటకురైతులను ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటికే ఔత్సాహికులైన కొందరురైతులు ప్రయోగాత్మకంగా పండిస్తున్నారన్నారు. పరిశోధనా కేంద్రాలలో రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని, వాతావరణ సూచనలను బులిటెన్ ద్వారా రైతులకు అందిస్తున్నామని, గత సంవత్సరం 104 బులెటెన్స్ విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహంచడం జరగుతుందని, యువతను వ్యవసాయం వైపునకు ప్రోత్సహించాలని తెలిపారు. అగ్రి టూరిజం అభివృద్ది చేయాలని, ప్రోత్సహించాలని పంట పండిస్తేనే కాదు చూపించినా ఆదాయం వస్తుందని తెలియజేయాలన్నారు. చింతపల్లి పరిశోధనా కేంద్రంలో గ్లాడియోలస్, చైనా ఆస్టర్, బంతి, లిలియం, జెర్బరా పూలు పండిస్తున్నామని, కొత్తగా తులిప్ పూలను సాగుచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం జరిగిందన్నారు.
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు ఎ. సుబ్బరామరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కూలీల కొరతను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో యాంత్రీకరణ, నూతవ వ్యవసాయ విధానాలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. వరిలో ఎదజల్లే పద్దతి ద్వారా పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. ఎక్కువ దిగుబడి నిచ్చే నాణ్యమైన విత్తన్నాన్ని పరిశోధనా కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న, సన్నకారురైతులు ఆర్దిక వెసులుబాటు కొరకు సమగ్ర వ్యవసాయ విధాన్నాన్ని పాటించాలని, కోళ్లు,పశువుల పెంపకం, పెరటి తోట సాగు చేసి అధిక ఆదాయం సాధించాలన్నారు. వ్యవసాయ దిగుబడులను విలువ అధారిత ఉత్పత్తులుగా మార్చి అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ప్రతి జల్లాకు ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాసరావు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారులు కె. రాబర్ట్ పాల్, కె. శ్రీదర్, జిల్లా ఉద్యాన అధికారి కె.యస్.ఎన్.రెడ్డి, ఆత్మ ప్రోజెక్టు డైరెక్టరు దక్షేశ్వరరావు ప్రసంగిస్తూ వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక వినియోగం, ప్రభుత్వం అందిస్తున్న పధకాలను తెలియజేసారు.
రైతులు ప్రసాదరావు,రామ్మూర్తినాయుడు మరియు వ్యవసాయ ఉత్పత్తి సంఘ ప్రతినిధులు జోగినాయుడు, సరస్వతి, శాంతి మాట్లాడుతూ వ్యవసాయ సాగులో వారియొక్కఅనుభవాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగు, రైతులకు అధిక ఆదాయం పొందేందుకు సలహాలను తెలియజేసారు.
కార్యక్రమంలో పరిశోధనా కేంద్రాలు తయారు చేసిన ప్రచురణలను విడుదల చేసారు.రైతులతో చర్చాకార్యక్రమం నిర్వహించి పరిశోధనా ఫలితాలను వారితో పంచుకున్నారు. వారి సలహాలను తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పి.సీతారాం, పి.శ్రీనివాసరాజు, పి.జోగారావు, ఎం. అనంత విహారి, ఎస్. వంశీకృష్ణ, ఎం .శ్రీనివాసరావు, పి. సౌజన్య, జి. అమృత వీణ, పి. వెంకటరావు, జి. చిట్టిబాటు, జి. అను, వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
addComments
Post a Comment