*- రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసమే యువగళం పాదయాత్ర*
*- ప్రజల మద్దతుతో దిగ్విజయంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి*
*- యువతలో భరోసా నింపుతున్న నారా లోకేష్*
*- చంద్రబాబు పాలనలో 6 లక్షల ఉద్యోగాల కల్పన*
*- మీడియాతో తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము*
గుడివాడ, ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసమే నారా లోకేష్ యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరి మద్దతు, యువత భాగస్వామ్యంతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. పాదయాత్రలో ముఖ్యంగా యువతతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చి ఆదుకోవాలని, మెగా డీఎస్సీ విడుదల చేయాలని, గ్రూప్- 2 నోటిఫికేషన్ విడుదల చేయాలని, మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, విద్యార్థులకు రవాణా, హాస్టల్ వసతులు కల్పించాలని, ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేయాలని నారా లోకేష్ ను యువత కోరడం జరుగుతోందన్నారు.
వీటన్నింటిపై యువతకు నారా లోకేష్ భరోసానిస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు నారా లోకేష్ ఒక హామీని ఇవ్వడం జరుగుతోందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు దృష్టి పెడతారంటూ నారా లోకేష్ స్పష్టం చేసారన్నారు. చంద్రబాబు పాలనలో ఆరు లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు 100 పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలి వెళ్లాయని, టిడిపి పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాదులో ఐటీని చంద్రబాబు ప్రోత్సహించడం వల్ల నేడు అది ఐటీ హబ్ గా వెలుగుతోందన్నారు. చంద్రబాబు గెలిస్తేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని యువత భావిస్తూ ఉందన్నారు.
ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్తున్నారని, ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసేలా కంపెనీలను తెస్తామని యువతకు నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగుల్లో ధైర్యం నింపుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని, ఐటిఐ కళాశాలను ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ యువతకు వివరిస్తూ వస్తున్నారని తెలిపారు. జగన్ పాలనలో యువత భవిష్యత్తు సర్వనాశనమైందని, యువత తమ హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాలని నారా లోకేష్ పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అనేక పథకాలను అమలు చేయడం జరిగిందని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామని నారా లోకేష్ చెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీని నిర్మించారని, ఉద్యోగుల భవనాలను దాదాపు పూర్తి చేశారని, జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి మరింత ముందుకు దూసుకుపోతుందని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి పునరుద్ధరిస్తామంటూ నారా లోకేష్ స్పష్టం చేశారన్నారు. అన్నదాతలకు అండగా ఉంటామంటూ వారిలో ధైర్యం నింపుతూ వస్తున్నారన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుల్లో కూరుకు పోతున్నారంటూ అన్నదాతలకు నారా లోకేష్ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. నిర్బంధాలు విధిస్తున్నా పోరాటం ఆగకుండా ముందుకు సాగుతున్న యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని వెనిగండ్ల ఆకాంక్షించారు.
addComments
Post a Comment