భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ

 *- భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ* 


 *- గుడివాడలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* 

 *- జెండాను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర నేత రామినేని*



గుడివాడ, ఏప్రిల్ 6 (ప్రజా అమరావతి);: ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలను తీసుకువచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ జెండాను రామినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రామినేని మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశం కుంభకోణాల మయంగా తయారయిందన్నారు. దేశాన్ని అవినీతి రహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో నరేంద్ర మోదీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాల మన్ననలను పొందుతున్నాయన్నారు. దేశ ప్రజల కోసం నరేంద్ర మోదీ అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో విధి విధానాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. వీటిలో నోట్ల రద్దు, జిఎస్టి అమలు, 370 అధికరణ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వం సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అమలు వంటివి ఉన్నాయన్నారు. వాజ్ పేయ్ సారధ్యంలో ఆవిర్భవించిన బిజెపి ప్రభుత్వం దేశ సంక్షేమం, అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. వాజ్ పేయ్ ఆశయాలను సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. భారతదేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. భారతదేశ ఘనమైన ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో  పయనింపజేయడంతో పాటు ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ పాత్రను పెంచేందుకు నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరికీ రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛను కల్పించడమే బిజెపి ఆశయమని రామినేని తెలిపారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్, నాయకులు లీలాకుమారి,  గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Comments