అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు.

 


గుడివాడ: ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి);


*అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు* 



          మంగళవారం మండల తహసిల్దారు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పందన అర్జీలు, గృహ నిర్మాణాలు, తాగునీరు, రీసర్వే తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.


          ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల దృష్టికి వచ్చిన స్పందన అర్జీలపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని, అర్జీదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవడానికి వెంటనే రుణాలు మంజూరు అయ్యేవిధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, మెటీరియల్ సరఫరా చేసి ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో తలెత్తే సమస్యలను ఆర్డీవో, హౌసింగ్ పీడీల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా చెరువులను ముందుగానే నింపుకోవాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. అధికారులు వారంలో నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో సందర్శించాలని, దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతిరోజు చేయాల్సిన పనుల చెక్ లిస్టు తయారు చేసుకోవాలని దాని ప్రకారం పనులను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


          ఈ సమావేశంలో ఆర్డీవో పి.పద్మావతి, ఎంపీడీవో వెంకటరమణ, డి ఆర్ డి ఏ పీడీ పిఎస్ఆర్.ప్రసాద్, హౌసింగ్ పీడీ జీవీ.సూర్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణరాజు, తహసిల్దారు కే.ఆంజనేయులు, హౌసింగ్ డిఈ రామోజీ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments