*సామాన్యుడి చెంతకు వైద్యం - ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం*
పార్వతీపురం, ఏప్రిల్ 5 (ప్రజా అమరావతి): సామాన్యుడికి చెంతకు వైద్య సేవలు అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుటకొరకు గ్రామస్థాయిలో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టరు కార్యక్రమం ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమశాఖమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు.పేదవాడి ప్రాణం కాపాడటమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు. పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్య శ్రీ లో 3,250 వ్యాధులను చేర్చడం జరిగిందని ఆయన చెప్పారు. గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం పొందలేని పరిస్థితుల్లో ఫ్యామిలీ డాక్టరు విధానం అత్యంత ఉపయోగకరం అన్నారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట లలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం జరుగుతుందని ఆయన వివరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురువారం ఫ్యామిలీ డాక్టరు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలో పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమశాఖమంత్రి పీడిక రాజన్నదొర జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్, 21నఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రోజెక్టుగా ప్రారంభించిన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. రక్తపోటు, మధుమెహం రోగులకు చికిత్స, మందులు అందించబడతాయని, శస్త్రచికిత్స చేయించుకున్న పేషంట్స్ ను ఇంటివద్దనే కలిసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు షెడ్యూల్ ప్రకారం అదే గ్రామానికి సందర్శించేలా 6-7 గ్రామ సచివాలయాలతో మ్యాప్ చేయబడిందని, ప్రతి వైద్యాధికారికి మొబైల్ ఫోన్ అందించబడుతుందని, ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుడిని పిలవడానికి వీలుగా ప్రజలకు అందించబడుతుందని, ఇది డాక్టర్ మరియు ప్రజల మద్య మంచి సంబంధాలు ఏర్పడుతుందని, ప్రజలకు వైద్యసేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా తోడ్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతంగా పనిచేయుటకు ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి కి ఇద్దరు వైద్యులను అందించారని, ఒకరు ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కి వైద్య సేవలు అందించగా, ఇతర వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (MMU)లో మ్యాప్ చేయబడిన గ్రామ ఆరోగ్య క్లినిక్ నకు రొటేషన్ ప్రతిపదికన ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నెలకు రెండుసార్లు సందర్శిస్తారని, ఒక్కో వైద్యుడు గరిష్టంగా 67 గ్రామాలకు మ్యాప్ చేయబడి, ప్రతి నెలా అదే గ్రామ ఆరోగ్య కేంద్రాలను సందర్శిస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 67రకాల మందులు, 14 రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు అందించడం జరుగుతుందని, ప్రతి గ్రామ ఆరోగ్య క్లినిక్ లలో జిల్లా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో గల వైద్యులు మరియు నిపుణుల నుండి సంప్రదింపులు పొందడానికి వీడియో సౌకర్యంతో టెలి కన్సల్టేషన్ అందించబడుతుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ జిల్లాలో అక్టోబరు 21వ తేదీన ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని, ఈరోజు నుండి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు. పార్వతీపురం జిల్లాలో పదహేను 104 వాహనాలతో దాదాపు 195 గ్రామ ఆరోగ్య క్లినిక్ లను కవర్ చేస్తూ ప్రారంభించిన ఈ సేవలను 19 వాహనాలతో 440 పైగా గ్రామ ఆరోగ్య కేంద్రాలకు విస్తరించబడం జరిగిందని తెలిపారు. మిలిగిన 104 వాహనాలు నెలలో 26 రోజుల పాటు తిరుగుతూ మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య సేవలందించనున్నాయన్నారు. కుటుంబ వైద్యుడు, అతని బృందం గ్రామంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారన్నారు. కుటుంబ వైద్యుడు సాధారణ ఓపి, గర్భిణీ స్త్రీలకు ప్రసవానంతర సంరక్షణ, తల్లులు, నవజాత శిశువులకు ప్రసవానంతర కేసు, పిల్లలు, రక్తహీనత పర్యవేక్షణ, కదల లేని రోగులకు ఇంటి వద్ద పరిశీలన, గ్రామ పరిశుభ్రతను గ్రామ కార్యదర్శితో సమన్వయంతో పర్యవేక్షిస్తారని, తద్వారా గ్రామంలో పరిశుభ్రత, వ్యాదులు ప్రభలకుండా చూస్తారని తెలిపారు. జిల్లాలో మార్చి 2023 నాటికి 101806 మంది ప్రజలు తమ సొంత గ్రామాల్లో కుటుంబ వైద్యుల కార్యక్రమంలో సేవలను పొందారని, ప్రసవానికి పూర్వం 7010 మంది, ప్రసవానంతరం 3858 మంది, మధుమేహం 4916 మంది,రక్తపోటు 9625 మంది, కేన్సర్ 33,635 మందికి సేవలను అందించినట్లు తెలిపారు. అత్యవసర సేవల్లో 108 అంబులెన్స్లు 17 వాహనాలు సేవలందిస్తున్నాయని జిల్లా కలెక్టరు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, ప్రోగ్రాం అధికారి డా.వినోద్, స్థానిక వైద్య అధికారి, మండల తహశీల్దారు, ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment