10వ తరగతి పరీక్షల ఫలితాలలో సత్తా చాటిన బి.సి. సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు వసతి గృహాల విద్యార్ధులు.


ఏపి సచివాలయం (ప్రజా అమరావతి);
*10వ తరగతి పరీక్షల ఫలితాలలో సత్తా చాటిన బి.సి. సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు వసతి గృహాల విద్యార్ధులు.*


*మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ...*


ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో బిసి సంక్షేమ శాఖకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు వసతి గృహాల విద్యార్ధులు ఉత్తమ ఫలితాలను సాధించి, తమ సత్తాను చాటారు. మెరుగైన ఉత్తీర్ణతా శాతంతో పాటు గుణాత్మకమైన ఫలితాలను కూడా సాధించి, ప్రతిభా పాటవాలలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. 

బిసి రెసిడెన్షియల్ పాఠశాలల నుండి 5,114 మంది విద్యార్ధులు 10వ తరగతి పరీక్షలు రాయగా, అందులో 4,579 మంది ఉత్తీర్ణులై 90శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఇది గత సంవత్సరం సాధించిన 82 శాతంతో పోలిస్తే, గణనీయమైన వృద్ధి అని చెప్పవచ్చు. అలాగే, ఉత్తీర్ణులైన వారిలో 3,858 మంది అనగా 76 శాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఫలితాల గుణాత్మక విలువను పెంచారు. రాశిలోనే కాదు, వాసిలో కూడా తాము మిన్నయేనని చాటారు. 11 రెసిడెన్షయల్ పాఠశాలల విద్యార్ధులు నూరు శాతం ఫలితాలను సాధించారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం బిసి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్ది 588/600 మార్కులు సాధించి రాష్ర్టస్దాయిలో  బిసి రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్ధులలో ప్రధమ స్ధానం పొందాడు. 

బిసి సంక్షేమ వసతి గృహాలనుండి 8,235 మంది విద్యార్ధులు 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, అందులో 5,916 మంది ఉత్తీర్ణులై 72 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఇది గత సంవత్సరం సాధించిన 61 శాతంతో పోలిస్తే, మెరుగైన ఫలితాలను సాధించారు. అలాగే, ఉత్తీర్ణులైన వారిలో 3,443 మంది అంటే 58శాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. 

గత సంవత్సరం 76 సంక్షేమ వసతి గృహాలు 100శాతం ఫలితాలను సాధించగా, ఈ సంవత్సరం 107 వసతి గృహాలు 100 శాతం ఫలితాలను సాధించాయి. రాష్ర్టంలోని 26 జిల్లాలలో పార్వతీపురం  మన్యం (93.80శాతం), పల్నాడు (87.32శాతం), విశాఖపట్నం (84.25శాతం), గుంటూరు (82.46శాతం), శ్రీకాకుళం (80.45శాతం) జిల్లాలు తొలి 5స్ధానాలను సూచించిన క్రమంలో కైవసం చేసుకున్నాయి. అలాగే, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలోని అన్నారెడ్డిపాలెం బిసి వసతి గృహమునకు చెందిన విద్యార్ధి 583/600 మార్కులతో రాష్ట్ర స్ధాయిలో బిసి సంక్షేమ వసతిగృహాల విద్యార్ధులలో ప్రధమ స్ధానం సాధించాడు. 

అత్యుత్తమ ఫలితాల సాధనతో పాటు, గుణాత్మకంగా కూడా మెరుగైన ఫలితాలను సాధించడానికి కృషి చేసిన వసతిగృహ సంక్షేమాధికారులకు సహాయ సంక్షేమాధికారులకు జిల్లా సంక్షేమాధికారులకు బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు అభినందనలు తెలిపారు. 

అలాగే, ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఉన్నత చదువులను అభ్యసించి, బంగారు భవిష్యత్తును చేజిక్కించుకుని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షిస్తూ వారికి మంత్రివర్యులు శుభాశీస్సులను అందజేశారు. 

రాష్ర్టస్ధాయిలో బిసి రెసిడెన్షియల్ పాఠశాలల నుండి 10 మంది అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని, బిసి సంక్షేమ వసతి గృహాల నుండి 10మంది అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని విజయవాడకు పిలిపించి, చిరు సన్మానం చేసి, ప్రశంసా పత్రాలను అందజేస్తామని మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.

Comments