సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కృషి, పట్టుదల అందరికీ ఆదర్శం

 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కృషి, పట్టుదల అందరికీ ఆదర్శం



- ఆయన జీవితం బహుజనులు స్ఫూర్తిగా తీసుకోవాలి


- రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పాలి..


- సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఎంపీ భరత్


రాజమండ్రి, మే 14  (ప్రజా అమరావతి): బహుజనులందరికీ స్ఫూర్తి ప్రదాత, మహానేత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కృషి, సంకల్ప బలం, పట్టుదల అందరకీ ఆదర్శమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం కొవ్వూరు ముఖ ద్వారం వద్ద ఫ్లై ఓవర్ వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎంపీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ 16వ శతాబ్దంలో తాను కలలు కన్న గోల్కొండ కోటకు మహరాజై బహుజనుల సంకల్ప బలం ఎంత దృఢమైనదో ఆచరణలో చూపించిన మహానేత మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహరాజ్ కు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, అంతటి సమ ఉజ్జీగా తెలంగాణా రాష్ట్రంలో మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఉందన్నారు. నాలుగు శతాబ్దాల క్రితం కుల వివక్ష ఏ విధంగా ఉండేదో గ్రహించాలని..ఆ దశ నుండి మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి మన జాతి పెద్దల కృషి ఫలితమేనన్నారు. ఆ మహానుభావుల జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక్క బహుజనులకే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ గర్వకారణం అన్నారు. అంతటి  మహోన్నతుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. బహుజనులందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి గోరిల్లా సైన్యాన్ని తయారు చేసి బడుగు బలహీన వర్గాల ఆశా దీపంగా.., అప్పటి ప్రతికూల పరిస్థితులను ఎదిరించి దశ దిశ నిర్దేశం వేసిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఏ రోజైనా గోల్కొండ కోటకు రాజు కావాలని అనుకున్నారు..అయ్యారని..అదే స్ఫూర్తి, పట్టుదల ప్రతీ ఒక్కరిలో ఉంటే అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించవచ్చునని ఎంపీ భరత్ అన్నారు. ఆయన ఆశయాలే మనకు స్ఫూర్తి, శ్వాస కావాలన్నారు.‌ ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించిన రాష్ట్ర గౌడ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సేన ప్రధాన కార్యదర్శి తాతా కృష్ణారావు ను ఎంపీ భరత్ అభినందించారు.

Comments