వన్ స్టాప్ సెంటర్లుగా జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపు.

 *వన్ స్టాప్ సెంటర్లుగా జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపు


*


*జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన*

*దాదాపు వెయ్యి మందికి పైగా హాజరు*

*క్యాంపులో రూ.10 వేల విలువైన ఉచిత వైద్య పరీక్షలు*

*అనునిత్యం సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్యం బాగుండాలి*

*త్వరలోనే వైజాగ్, రాజమండ్రి, తిరుపతిలలో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు*

*ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా అవతరిస్తోన్న ఆంధ్రప్రదేశ్*


:-*సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ*


*వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని*

 విజయవాడ (ప్రజా అమరావతి);

సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్యం బాగుండాలన్న దృక్పథంతో 2 రోజుల పాటు ఉచిత జర్నలిస్టుల హెల్త్ క్యాంపు నిర్వహించామని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. త్వరలోనే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నామన్నారు. శనివారం విజయవాడలోని ఆంధ్రా లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ , వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. టి.కృష్ణబాబు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్రప్రసాద్ కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు, అధికారులు రక్తపరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్ లు చేయించుకున్నారు. జర్నలిస్టులతో చర్చించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ యూనిట్,  మొబైల్ డెంటల్ కేర్ యూనిట్ లను పరిశీలించి సిబ్బంది ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ, పనిలో విమర్శలు ఎక్కువ  ... ఇలాంటి ఒత్తిళ్లలో కూడా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పిలవబడే మీడియాలో విధులు నిర్వర్తిస్తున్న  జర్నలిస్టుల ఉద్యోగం కత్తిమీద సాములాంటిందన్నారు. పని ఒత్తిడి వల్ల సరైన సమయంలో తినలేక ఆరోగ్యం దెబ్బతినే జర్నలిస్టులు కోకొల్లలన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు పేదవారికి అందాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు వరంగా మారిందన్నారు.  ఉచిత హెల్త్ క్యాంపులో దాదాపు 10 వేల రూపాయల విలువగల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవడం ద్వారా  మరింత మెరుగైన జీవితాన్ని జర్నలిస్టులు అనుభవిస్తారని భావిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై తమ చూపు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని తెలిపారు.


వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టు పాత్ర సమాజంలో కీలకమైనదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా జర్నలిస్టుల కష్టం మరవలేనిదన్నారు. ఈ క్రమంలో వారిపై ప్రత్యేక దృష్టి సారించి 10వేల ఖర్చు చేసే వైద్య పరీక్షలన్నీ జరల్నిస్టులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ క్యాంపు ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. కుటుంబ సమస్యలు పక్కనబెట్టి, ఆరోగ్య సమస్యలు ఫణంగా పెట్టి సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టుల ఆరోగ్యాలు బాగుండాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల కోసం త్వరలో మరిన్ని నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నామన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం వన్ స్టాప్ సెంటర్లుగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందజేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ప్రధానంగా గ్రామ స్థాయిలో గడప వద్దనే వైద్య సేవలు అందించే ఫ్యామీలీ డాక్టర్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇప్పటివరకు కోటి 8 లక్షల మంది ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారన్నారు. 


వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి.కృష్ణబాబు మాట్లాడుతూ ముందస్తుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి పరిష్కరించడం ద్వారా మరింత మెరుగైన జీవనం కొనసాగించవచ్చన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జర్నలిస్టులకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలని కోరిన వెంటనే వైద్య శాఖ మాత్యులు శ్రీమతి విడదల రజిని సానుకూలంగా స్పందించి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తో చర్చించి వెంటనే ఏర్పాటు చేశారన్నారు. త్వరలోనే ప్రముఖ నగరాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నామన్నారు. పేద ప్రజలందరికీ రూ.3,300 కోట్ల ఖర్చుతో డా.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగుల హెల్త్ స్కీం కన్నా మరింత మెరుగ్గా జర్నలిస్టుల హెల్త్ స్కీంను ప్రవేశపెట్టామన్నారు.  ఇప్పటివరకు 5 కోట్ల 30 లక్షల మంది ఆంధ్రప్రజల హెల్త్ రికార్డును మెయింటెన్ చేస్తున్నామన్నారు.


  సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడే జర్నలిస్టుల పాత్ర సమాజంలో కీలకమైనదన్నారు. వార్తల సేకరణ కోసం సరైన సమయంలో తిండి, నిద్రలేక అనారోగ్యం పాలవుతున్న జర్నలిస్టుల సంఖ్య అధికం అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సౌజ్యంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నిసార్లు ఆరోగ్య పరంగా ఇబ్బంది తలెత్తినా ప్రతిసారి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు అతి తక్కువ ప్రీమియంతో ఏర్పాటు చేసిన హెల్త్ స్కీంను జర్నలిస్టులు వినియోగించుకోవాలన్నారు. జర్నలిస్టులు రూ.1,250, ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లించడం ద్వారా హెల్త్ స్కీం లబ్ధి పొందవచ్చన్నారు. నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల పేద ప్రజలకు రూ.2.10 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్న ప్రభుత్వానికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉచిత హెల్త్ క్యాంపు చేపట్టాలన్న ఆలోచనను అమలు చేసిన మంత్రి విడదల రజినికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సమాచారం చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సేవలు ఎనలేనివని కొనియాడారు. తొలిరోజు  ఉచిత హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించిందన్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారని వెల్లడించారు.


డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోసం రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపులో అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్య పెంచి ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తొలిరోజు క్యాంపులో భాగంగా వైద్య పరీక్షలు చేశామన్నారు. రెండో రోజు రిపోర్ట్ ల వెల్లడి అనంతరం వైద్యులచే కన్సల్టేషన్ ఉంటుందన్నారు.   Comments