జగనన్నకు చెబుదాంలో అందరూ భాగస్వామ్యం కావాలి.



*జగనన్నకు చెబుదాంలో అందరూ భాగస్వామ్యం కావాలి*



పార్వతీపురం, మే 19 (ప్రజా అమరావతి): జగనన్నకు చెబుదాంలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. జిల్లా ప్రగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంను ప్రాధాన్యతతో ముఖ్య మంత్రి ప్రారంభించారని, అర్హులకు ప్రయోజనాలు దక్కాలని ఆయన చెప్పారు. సాలూరు నియోజక వర్గంలో మొబైల్ టవర్లు త్వరగా ఏర్పాటు చేసి మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ అందించాలన్నారు.  వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల మ్యాపింగ్ ను గిరిజనులు, ఆ ప్రాంత ప్రజలు కోరుకున్న చోట్ల చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరు ఏరియా ఆసుపత్రి పనితీరుపై ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో విచారణ జరిపించాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది విధులకు హాజరు కాకుండా మేనేజ్ చేస్తున్నారని, ఆసుపత్రి పనితీరు సక్రమంగా లేదని ఆయన చెప్పారు. జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో మందులు లభ్యంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా ప్రగతిలో భాగంగా వేసవి, వర్షా కాలంలో ఎదురయ్యే పరిస్థితిపై పక్కాగా కార్యాచరణ తయారు చేయాలని ఆయన సూచించారు. రైతులు కోరుకున్న పంట విత్తనాలు పంపిణి చేయాలని ఆయన ఆదేశించారు. ధాన్యం సేకరణ సమయంలో కొనుగోలులో ఎటువంటి సమస్యలు తలెత్తరాదని ఆయన స్పష్టం చేశారు. జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో బోర్లు కూడా పనిచేయడం లేదని వాటిపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని, వాటి బిల్లులు వెంటనే అప్ లోడ్ చేయాలని అన్నారు. అటవీ అనుమతులు అవసరమైన రహదారుల అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టిలో పెట్టాలని ఆయన ఆదేశించారు. 


జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విత్తనాలు సరఫరాకు ముందుగానే శాస్త్రవేత్తలతో చర్చించాలని సూచించారు. ఇ క్రాప్ ను భూమి ఏ కేటగిరీకి చెందినది చూడకుండా పంట ఆధారంగా చేయాలని ఆయన అన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహాయకులకు తగిన అవగాహన, శిక్షణ కల్పించాలని ఆయన అన్నారు. జల్ జీవన్ మిషన్ క్రింద కొద్దిగా చెల్లింపులు జాప్యం వలన పనులు కొంత వరకు జాప్యం జరుగుతుందని ఆయన వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు 1364 పనులు రూ.365 కోట్లతో మంజూరు అయ్యాయని చెప్పారు. సచివాలయం పరిధిలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను ఇంజినీరింగ్ సహాయకులు పర్యవేక్షణ చేయాలని పాలకొండ శాసన సభ్యులు సభ దృష్టికి తెచ్చిన అంశంపై స్పందిస్తూ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపడుతున్న పనుల బిల్లులు తక్షణం అప్ లోడ్ చేయాలని అన్నారు. గ్రామ సచివాలయం పనులకు సంబంధించి బిల్లులు గురు వారం జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన మొత్తం నెలాఖరు నాటికి జమ అవుతుందని అన్నారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. పనులను చేపట్టడంలో సమస్యలు ఉంటే సంబంధిత ప్రజా ప్రతినిధుల దృష్టిలో పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టరు విధానంలో నెల రోజులు ముందుగా గ్రామ సచివాలయం పరిధిలో షెడ్యూల్ పెట్టాలని ఆయన అన్నారు. ఈ విధానంపై ఇప్పటికీ క్రింద స్థాయి సిబ్బందిలో పూర్తి అవగాహన లేదని, తగు శిక్షణ కల్పించాలని ఆయన పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ ల మ్యాపింగ్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలు ఏ పి.హెచ్. సి పరిధిలోకి వైద్యం నిమిత్తం వెళ్ళినా వైద్యం అందించాలని అన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఆరు అంచెల విచారణ పై ప్రతి ఒక్కరికీ స్పష్టత ఉండాలని అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ లను భాగస్వామ్యం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరితో ఆర్జి పెట్టించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల పట్ల సరైన అవగాహన లేక, సరైన పత్రాలు లేక ప్రయోజనం పొందలేక పోతున్నారని ఆయన చెప్పారు. నాడు నేడు పనులలో భాగంగా ఒకటి, రెండు విడతల్లో చేపట్టిన పాఠశాలల్లో మూడవ విడత కాంపోనెంట్స్ లేవని, వాటిని సమకూర్చుటకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు నిధులు ఉన్నాయని, సిమెంట్ కొరత లేదని ఆయన చెప్పారు. 


 జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ధృవీకరించిన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు పొందిన రైతులకు రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపడుతున్న పనుల బిల్లులు అప్ లోడ్ చేయుటకు 24*7 వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించిందినట్లు తెలిపారు. జిల్లాలో అటవీ అనుమతులు అవసరమైన రహదారులకు ఐదు రోజుల్లో మంజూరు చేస్తామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టరు విధానం అమలు చేయడం ద్వారా ఓపి 26 వేలకు పెరిగిందని ఆయన తెలిపారు. ఎం.ఎల్.హెచ్.పి లు ప్రధాన కేంద్రాల్లో నివాసం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సీతంపేట ప్రాంతంలో 51 గూడెలను రెవిన్యూ గ్రామాలుగా మార్చుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. 


శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న మ్యాపింగ్ వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, దానిని పరిశీలించాలని అన్నారు. పాలకొండ లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు భవనాన్ని గుర్తించామని చెప్పారు. 


శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ సీతంపేట ప్రాంతంలో ఆర్. డబ్ల్యూ.ఎస్ పనులు పరిశీలించుటకు ఇంజినీర్లు కొరత ఉందన్నారు. సీతంపేట లో ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 


 శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ మునిసిపల్ డంపింగ్ యార్డును మార్చుటకు భూమిని అప్పగించాలని అన్నారు. 


 *జూన్ 8న తోటపల్లి నీరు విడుదల*


జూన్ 8న తోటపల్లి నీరు విడుదల చేయుటకు ప్రాథమికంగా సమావేశంలో నిర్ణయించారు. 


ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు, శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, జాయింట్ కలెక్టర్ మరియు పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ , సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా అటవీ అధికారి జి.ఏ.పి.ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి. వాగ్దేవి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు,  జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, గృహ నిర్మాణ సంస్థ ఇన్ ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ,జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సన్యాసి నాయుడు, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, ఏపిఎంఐపి పిడి ఎల్. శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీర రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి బి.సూర్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎం.జేమ్స్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments