పుట్టపాడు ఎన్ కౌంటర్ బూటకం* ఆజాద్*

 *పుట్టపాడు ఎన్ కౌంటర్ బూటకం* **ఆజాద్*



చర్ల:  మే 07 (ప్రజా అమరావతి);

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం పుట్టపాడులో జరిగిన ఎన్‌కౌంటర్‌  బూటకమని, నిరాయుధులను పట్టుకుని, చిత్రహింసలు పెట్టి కాల్చి పంపారని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌  ఆరోపించారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్‌ నాయకులు  భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్‌, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ అశోక్‌ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ(బీకే-ఏఎస్‌ఆర్‌) డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ ఆదివారం పలు పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ చర్ల ఎల్‌వోఎస్‌ కమాండర్‌ మడకం ఎర్రయ్య అలియాస్‌ రాజేష్‌, మరో దళ సభ్యుడు మృతి చెందారని, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారని, ఇదంతా అబద్ధమని కొట్టిపారేశారు.


రాజేష్‌ పార్టీ పనుల రీత్యా నిరాయుధుడిగా పుట్టపాడు గ్రామానికి వెళ్లగా, ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపారని ఆరోపించారు. నిజమైన ఎన్‌కౌంటర్‌గా నమ్మించడానికి తమతో తెచ్చుకున్న ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ పెట్టి, అదే పుట్టపాడు గ్రామానికి చెందిన నందాల్‌ అనే అమాయక ఆదివాసీని కూడా కాల్చి హత్య చేశారని ఆరోపించారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమ జిల్లా, కంగాల్‌ గ్రామానికి చెందిన రాజేష్‌ తన 19వ ఏట విప్లవోద్యమంలో చేరి 2016 నుండి 2022 అక్టోబరు వరకు చర్ల ఎల్‌వోఎస్‌ సభ్యుడిగా, 2022 అక్టోబర్‌లో ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా ప్రమోట్‌ అయ్యాడని తెలిపారు. రాజేష్‌ పార్టీ క్రమశిక్షణను పాటించిన గొప్ప విప్లవకారుడని ఆయన ఆశయాలని కొనసాగిద్దామని ఆ ప్రకటనలో ఆజాద్‌ పిలుపునిచ్చారు.

Comments