రాయితీపై నాణ్యమైన వేరుశనగ విత్తన పంపిణీని చేస్తున్నాం.


 *రాయితీపై నాణ్యమైన వేరుశనగ విత్తన పంపిణీని చేస్తున్నాం*


*: వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


*: మంచి నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి*


పుట్టపర్తి  (శ్రీ సత్యసాయి జిల్లా), మే 29 (ప్రజా అమరావతి):


రాయితీపై నాణ్యమైన వేరుశనగ విత్తన పంపిణీని చేస్తున్నామని, వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి పట్టణంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద రాయితీపై వేరుశనగ విత్తన పంపిణీని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్ పర్సన్ రమణారెడ్డి, తదితరులు ప్రారంభించారు. అనంతరం వారు రైతులకు విత్తనాన్ని పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా పండించే వేరుశనగకు సబ్సిడీ ఇస్తూ నాణ్యత కలిగిన విత్తనాన్ని సరఫరా చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రం ద్వారా ఎక్కడ క్వాలిటీ, క్వాంటిటీలో రాజీ లేకుండా నాన్న మీద విత్తనం అందించి రైతు అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం రాయితీ విత్తన వేరుశనగను పంపిణీ చేస్తోందన్నారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. పొరపాటున ఎక్కడైనా విత్తనం సరిగా లేదని అనిపిస్తే వ్యవసాయ అధికారిని అడగాలని, నాణ్యత పరిశీలించుకుని మంచి విత్తనం తీసుకెళ్లాలన్నారు. విత్తనాలు మొలకెత్తుతాయా లేదా అనేది ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ట్రేలలో సాగు చేస్తున్నామని, మనం నాటిన విత్తనాలను ఆర్బికేలలో పరిశీలించవచ్చన్నారు. రాయితీ వేరుశనగ విత్తనం నాణ్యత చాలా బాగుందని, అపోహలను సృష్టిస్తే రైతులు ఎవరూ నమ్మవద్దన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత అంశమని, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని పంపిణీ చేసేలా ఈ సీజన్ ను మొదలు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 90 శాతం మందికి పైగా రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ ఒక ఎకరానికి 30 కేజీల ఒక బ్యాగ్, రెండు ఎకరాలలోపు ఉన్న వాటికి 2 బ్యాగులు, మూడు ఎకరాలకు పైన ఎంతఉన్నా కూడా మూడు బ్యాగులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 30 కేజీల ఒక బ్యాగ్ 2,790 రూపాయలు ఉండగా, అందులో 1,116 రూపాయలు అంటే 40 శాతం సబ్సిడీతో 1,674 రూపాయలకి అందించడం జరుగుతోందన్నారు. మూడు బ్యాగులు తీసుకుంటే 8,370 రూపాయలు అవుతుండగా, అందులో 3,348 రూపాయలు అంటే 40 శాతం సబ్సిడీ ఇస్తుండగా, రైతులు రూ.5,022 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో వేరుశనగ ఎక్కువగా సాగు చేస్తుండగా, సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను పంట వేయడానికి, వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, రైతులు ఎవరు ఇతర అవసరాలకు వాడకూడదన్నారు. జిల్లాలోని అన్ని ఆర్బికేల పరిధిలో విత్తనం పంపిణీ ప్రారంభమవుతుందని, రైతులందరూ రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాన్ని తీసుకోవచ్చన్నారు. జిల్లాకు లక్ష క్వింటాళ్ల వరకు వేరుశనగ అవసరం అవుతుండగా, ఇప్పటికే 40 వేల క్వింటాళ్ల వరకు వేరుశనగ వచ్చిందని, ఎక్కడా వేరుశనగ విత్తనానికి కొరత లేదన్నారు. మిగతా విత్తనం కూడా వస్తుందని, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లు రాత్రిపగలు పనిచేస్తున్నాయని, జిల్లాలోని కదిరి, ధర్మవరం ప్రాంతాల్లో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల యూనిట్ల నుంచి, అనంతపురం జిల్లా నుంచి కూడా విత్తనం సరఫరా పెరిగిందని, రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ సరిపడా విత్తనాలు ఉన్నాయన్నారు. జిల్లాకు పెట్టుకున్న లక్ష క్వింటాళ్ల లక్ష్యం మేరకు నాణ్యతగా మంచి విత్తనం సరఫరా చేయడం జరుగుతుందన్నారు.


ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మంచి నాణ్యమైన విత్తనాన్ని అందిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి వర్షాలు బాగా కురిసి భూగర్భజలాలు పెరిగాయని, జగనన్న ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వం అందించిన రాయితీ వేరుశనగ విత్తనాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏడీఎ విద్యావతి, ఎంపిపి రమణా రెడ్డి, మార్క్ఫెడ్ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



Comments