వైసిపి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టగలిగాం.

 *- టిడిపి మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తాం*

*- వైసిపి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టగలిగాం


*

 *- నిరుద్యోగులు, రైతులకు టీడీపీ మేనిఫెస్టోలో పెద్దపీట*

 *- మహిళలపైనా వరాల జల్లు కురిపించిన చంద్రబాబు*

 *- హామీలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం* 

 *- ఏపీని తిరిగి గాడిలో పెట్టడమే చంద్రబాబు లక్ష్యం*

 *- మేనిఫెస్టో టీడీపీ కేడర్లో జోష్ నింపిందన్న వెనిగండ్ల*గుడివాడ, మే 29 (ప్రజా అమరావతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తామని తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో వెనిగండ్ల  మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఫేజ్ -1 మేనిఫెస్టోను మహానాడులో ఆవిష్కరించడం శుభ సూచకమని అన్నారు. వచ్చే దసరా నాటికి పూర్తి మేనిఫెస్టోను విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా జరుగుతున్న వైసిపి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను మహానాడు వేదికగా ఎండగట్టగలిగామని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని తెలిపారు. టిడిపి విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగులు, మహిళలు, రైతులకు పెద్దపేట వేయడం జరిగిందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను టిడిపి తీసుకుంటుందన్న చంద్రబాబు నిరుద్యోగుల్లో భరోసాను నింపగలిగారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చారన్నారు. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3వేల భృతిని అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారన్నారు.

18-59 ఏళ్ళ వయసున్న మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ. 15 వేలు చొప్పున తల్లికి వందనం పేరుతో ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారన్నారు. ప్రతి ఇంటికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందుతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి పిల్లల నిబంధనను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రైతులకు భారంగా మారిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం అన్నదాత కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. టిడిపి ఆవిర్భావం నుండి బీసీలు వెన్నుముకగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. బీసీలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని బీసీల రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని చంద్రబాబు ప్రకటించారన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని లక్ష్యంతో మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలనను అందిస్తామన్నారు. ఏపీని తిరిగి గాడిలో పెట్టడమే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. మొత్తం మీద మహానాడు వేదికగా చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో టిడిపి క్యాడర్లో జోష్ నింపిందని వెనిగండ్ల చెప్పారు.

Comments