ముఖ్యమంత్రి పర్యటన సభ ఏర్పాట్లపై కలెక్టర్, శాసన సభ్యులు పరిశీలన.



గుడివాడ: మే 07 (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి పర్యటన సభ ఏర్పాట్లపై కలెక్టర్, శాసన సభ్యులు పరిశీలన*



          గుడివాడలో ముఖ్యమంత్రి పర్యటన సభ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు శాసన సభ్యులతో కలిసి పరిశీలించారు.


          రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19 వ తేదీన గుడివాడలోని టిడ్కో గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేయునున్న నేపథ్యంలో ఆదివారం గుడివాడలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మచిలీపట్నం, గుడివాడ, శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), జిల్లా ఎస్పీ పి.జాషువా లతో కలసి గుడివాడలో పర్యటించారు.


          ఈ సందర్భంగా వారు గుడివాడలో నిర్మాణాలను పూర్తి చేసుకున్న టిడ్కో గృహాల ప్రాంగణంలో పర్యటించి ముఖ్యమంత్రి బహిరంగ సభా ప్రాంగణం, హెలీపాడ్, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అనువైన స్థలాల కోసం పరిశీలించారు. బహిరంగ సభ కోసం టిడ్కో గృహాల పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ వర్షపు నీరు నిలవటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. ఈ రెండుమూడు రోజుల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సభాస్థలి ఏర్పాట్లపై ముందుకు వెళ్లేలా చర్చించుకున్నారు.


          అనంతరం స్థానిక శాసన సభ్యులు కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికమైన అన్ని వసతులను కల్పించి నిర్మించిన దాదాపు 9 వేల టిడ్కో గృహాలను ఈ నెల 19 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేయునున్నట్లు వెల్లడించారు. దీనికోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008వ సంవత్సరంలోనే టిడ్కో గృహ నిర్మాణాల నిమిత్తం 77 ఎకరాలను భూసేకరణ చేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపట్టి కనీసం 25 శాతం కూడా పూర్తి చేయకుండా వదిలేశారని అన్నారు. తర్వాత అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దీని కోసం రూ.600 కోట్లను కేటాయించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 9 వేల గృహాలను నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. అదేవిధంగా ఇదే నెలలో 22 వ తేదీన మరో గొప్ప కార్యక్రమం మచిలీపట్నం పోర్టు పనులను సీఎం ప్రారంభిస్తారని, దీనికి సంబందించిన ఏర్పాట్లను మచిలీపట్నంలో ఉదయం పరిశీలించామని తెలిపారు. పోర్టు కోసం 19 వందల ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని, అన్ని అనుమతులు పొంది రూ.4 వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న పోర్టును రెండు సంవత్సరాల్లో నాలుగు బెర్తలను పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని అన్నారు. జిల్లాకు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.


          ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, గుడివాడ, బందరు రెవెన్యూ డివిజన్ల అధికారులు పి.పద్మావతి, ఐ.కిషోర్, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.


Comments