ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా అధికారులు అంకిత భావంతో పని చేయాలి...


అమరావతి (ప్రజా అమరావతి);

*ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా అధికారులు అంకిత భావంతో పని చేయాలి...*


*ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య పథకాల పోస్టర్లు ప్రదర్శించాలి...*

*పెరిగిన డైట్‌ ధరలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలి..*

*పారిశుద్ధ్యం మెరుగుపడాలి....*

*వ్యర్థాల నిర్మూలనకు ఇన్సినిరేటర్లు..*

*ప్రతి రోగీ చిరునవ్వుతో ఇంటికెళ్లాలి...*

*తరచూ తనిఖీలతో ఆస్పత్రుల్లో మార్పు తేవాలి...*

*వైద్య ఆరోగ్య శాఖ  అధికారులతో సమీక్షలో మంత్రి విడదల రజిని అదేశాలు..*


అమరావతి: వైద్య ఆరోగ్య రంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులకనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలు మెరుగు పడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల తీరులో గణనీయమైన  మార్పులొచ్చాయనే విషయాన్ని నిరూపించేలా ఉండాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మంత్రి మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన నాలుగయిదు ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించేలా చూడాలని మంత్రి సూచించారు.  ఇంతకుముందెన్నడూ లేని విధంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయిస్తున్న నిధులు, సిబ్బంది నియామకం...వంటి వాటి విషయంలో ఒక చరిత్ర సృష్టించారని..ఇది అందరూ గుర్తెరిగేలా ఈ పోస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మంత్రి రజిని తెలిపారు. 

*రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలి...*

రోగి ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లేవరకూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో, తాను మంచి సేవలు పొందానన్న సంతృప్తితో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని మంత్రి రజిని ఆదేశించారు. పారిశుద్ధ్యం,  పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ ...ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ, లేనిదీ అధికారులు తరచూ చూడాలని మంత్రి ఆదేశించారు. తనిఖీల సంఖ్య పెంచాలని, తనిఖీల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మాత్రం అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు పసిగట్టినా సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని  మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల వద్ద బాలింతలకు ప్రత్యేకించే విధంగా పింక్‌ కలర్‌ కర్టెన్లు  ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు.  ఇందుకోసం పెద్ద మొత్తం కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. విశాఖ కేజీహెచ్‌ ఈ నాలుగేళ్లలో ఎంతో అద్భుతంగా మారిందని, ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికే అక్కడ ఏర్పడ్డాయని మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు.  ముఖ్యంగా మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్‌ డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

*తనిఖీలతో ఆస్పత్రుల పనితీరు మారాలి...*

 ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని , పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని మంత్రి రజిని అధికారులకు సూచించారు. తరచూ తనిఖీల ద్వారా ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. 

*ఇన్సినిరేటర్స్‌ ఏర్పాటుకు ఆదేశాలు...*


ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే దాతల నుంచి సహకారాన్ని తీసుకుని, 16 టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద ఇన్సినిరేటర్స్‌ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని మంత్రి ఆదేశించారు.  అన్ని ప్రభుత్వ ఆస్పతుల్లో సిబ్బంది నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని, తదనుగుణంగా జీతానికి దీన్ని లింక్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. 

*డైట్‌ను తనిఖీ చేయాలి...*

రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్‌ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రూ.80కు పెంచిన నేపథ్యంలో మెనూ చార్టులో నిర్దేశించిన మేరకు మూడుపూటలా నాణ్యమైన ఆహారం ఇస్తున్నదీ, లేనిదీ  తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

గిరిజన ప్రాంతాలకు *మహాప్రస్థానం వాహనాలను పెంచాలి...*

 మహాప్రస్థానం వాహనాల గురించి మంత్రి రజిని మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి సరిహద్దులు కలిగిన విశాఖపట్నం, విజయన గరాల ఆస్పత్రులకు మహాప్రస్థానం వాహనాలను పెంచాలని, ఈ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి రజిని ఆదేశించారు. అలాగే పెద్ద జిల్లా అయిన గుంటూరు, యాత్రికులు ఎక్కువగా సందర్శించే తిరుపతిలలో కూడా మహాప్రస్థానం వాహనాల సంఖ్య పెంచాల్సిన అవసరముందని మంత్రి సూచించారు. 

*సిటి, ఎమ్మారై సేవలపై అధ్యయనం  ...*

రాష్ట్ర వ్యాప్తంగా సీటీ, ఎమ్మారై యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. 

 ఈ సమీక్షలో వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌ డాక్టర్ నరసింహం, డిప్యూటీ డైరెక్టర్ కర్రి అప్పారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments