రైతుల ప్రయోజనాలే పరమావిధిగా విప్లవాత్మక సంస్కరణలు



వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం

-  రైతుల ప్రయోజనాలే పరమావిధిగా విప్లవాత్మక సంస్కరణలు


- రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో  రైతు ముంగిటకే వ్యవసాయ సేవలు

- రైతు గ్రూపులకు విరివిగా యంత్ర సేవా పరికరాలు

- అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ల ఏర్పాటుతో నకిలీలకు చెక్

- ఏ  సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ జమ

- నోటిఫై చేసిన పంటలకు ఉచిత పంటల బీమా

- రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు

- దేశానికే ఆదర్శంగా మన వ్యవసాయ సంస్కరణలు

- ఏపీ మీడియా అకాడమీ జూమ్ సమావేశంలో మంత్రి కాకాణి 


నెల్లూరు, మే 20 (ప్రజా అమరావతి): మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అగ్ర తాంబూలం వేస్తూ, రైతుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా అమలు చేస్తున్న అనేక సంస్కరణలు భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

 శనివారం ఉదయం విజయవాడ నుంచి ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో  జర్నలిజం డిప్లమా కోర్సులో భాగంగా రాష్ట్రం నలుమూలల నుండి పాత్రికేయులతో నిర్వహించిన జూమ్ సమావేశానికి నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరైన మంత్రి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, రైతుకు అందిస్తున్న సేవలపై పాత్రికేయులకు అవగాహన కల్పించారు. 

 ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ రంగం - ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై క్లుప్తంగా  వివరించారు. మన సంస్కృతి,సాంప్రదాయం కలగలిసినదే వ్యవసాయమని, సుమారు  65 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, మరో 15 నుంచి 20 శాతం మంది పరోక్షంగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యానవన, వాణిజ్య పంటలను పండిస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రిగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పుడు నుంచి రైతుల ప్రయోజనాలు పరమావధిగా ఎవరి ఊహకు అందని సంస్కరణలను తీసుకొచ్చారని చెప్పారు. ప్రధానంగా రైతుకు విత్తనం నాటినప్పటి నుంచి పంట కోతకు వచ్చేవరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా అవసరమైన అన్ని సేవలను రైతు ముంగిటకే తీసుకొచ్చేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. మన రైతు భరోసా కేంద్రాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ అవార్డును యునైటెడ్ నేషన్స్ అనుబంధంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మన రైతు భరోసా కేంద్రాలకు ప్రకటించడం మనకు గర్వకారణమన్నారు. అలాగే ఈ క్రాప్ పద్ధతి ద్వారా స్పష్టమైన వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చామని, రైతు తన పొలంలో ఏ పంట వేశాడు, ఎంత మేర వేశాడు అనే సమాచారాన్ని గ్రామీణ వ్యవసాయ సహాయకుల ద్వారా  సేకరించి ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించి రైతును ఏ విధంగా ఆదుకోవాలి అన్న స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామన్నారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేసి అన్నదాతలకు విరివిగా ట్రాక్టర్లు, కల్టివేటర్లు అందిస్తున్నామన్నారు. వారికి అవసరమైన పరికరాలను బుక్ చేసుకునేందుకు ఒక యాప్ కూడా అందుబాటులో తీసుకొచ్చామన్నారు. ఆర్ బి కే ఛానల్ ను, మాస పత్రికను నిర్వహిస్తూ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు, వినూత్న పద్ధతులు, చీడపీడల నివారణకు చర్యలు, ఆదర్శ రైతుల అభిప్రాయాలు మొదలైన సరికొత్త వ్యవసాయం పద్ధతులపై  రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతుకు పెట్టుబడి సహాయంగా పిఎం కిసాన్ రైతు భరోసా నగదు రూ. 13500 ప్రతి సంవత్సరం అందిస్తున్నామని, ఇప్పటివరకు 27 వేల కోట్లు రైతులకు అందించామని చెప్పారు.  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తూ  సమృద్ధిగా రెండు పంటలకు సాగునీరు విడుదల చేస్తూ, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయడం, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ బృందాల ఏర్పాటు వంటి చర్యలతో వ్యవసాయ రంగంలో రైతుకు అన్నివిధాలా అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 147 గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు, భూసార పరీక్షలకు చేనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 73 ల్యాబ్లు ప్రారంభించామని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో మెరుగని ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు అందజేసి ప్రభుత్వపరంగా అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నామన్నారు. నోటిఫై చేసిన పంటలకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి మన రాష్ట్రం తప్పుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించి మొత్తం ప్రీమియం నూరుశాతం చెల్లిస్తుందని చెప్పారు. మన విధానాన్ని అన్ని రాష్ట్రాలకు అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం కూడా మన విధానాన్ని అమలు చేసేందుకు మొగ్గుచూపి, మనల్ని మళ్లీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లో చేరాలని కోరినట్లు మంత్రి చెప్పారు. అలాగే ఏ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని రైతుకు నేరుగా అందజేసి, రైతు ఎక్కడా నష్టపోకుండా చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వినూత్న విధానాలతో ధాన్యం ఉత్పత్తి 14 నుంచి 15 లక్షల టన్నుల వరకు అధికంగా పెరిగిందని, దేశంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, పామాయిల్, బొప్పాయి, నిమ్మ, మిరప, టమోటా, కొబ్బరి మొదలైన పంటల సాగులో నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. అలాగే మన రాష్ట్రంలోని ఆచారి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో 31వ స్థానంలో ఉండేదని, గత ఏడాది ప్రకటించిన ర్యాంకింగ్లో 13వ స్థానానికి చేరిందని, త్వరలో ప్రకటించే ర్యాంకింగ్లో మరింత ముందు వరుసలో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గుర్తు చేశారు. అలాగే పంట మార్పిడి పద్ధతులను ప్రోత్సహిస్తున్నామని, తద్వారా తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, మిరియాలు, జాజికాయ వంటి పంటల సాగులో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. బిందు సేద్యం ద్వారా రైతులకు సబ్సిడీపై పైపులు, స్ప్రింకర్లు అందించి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల పండించేందుకు సులభతర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తూ, ఈ పంటల అమ్మకాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుందని, వీటిని బయట మార్కెట్ కంటే 15 శాతం అధిక ధరకు టీటీడీ కొనుగోలు చేసి ప్రసాదాల్లో వినియోగిస్తుందన్నారు. రైతుకు తన భూమిలో ఏమేర పోషకాలు ఉన్నాయి, భూసారం ఎలా ఉంది, ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుంది అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ కు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి రైతాంగానికి అన్ని విధాల అండగా నిలిచేందుకు వ్యవసాయ రంగంలో తమ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయని, వీటిపై విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించేందుకు పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని, రైతులు కూడా ప్రభుత్వం వినూత్నంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములై అభివృద్ధి ఫలాలు అందిపుచ్చుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

 ఈ జూమ్ సమావేశంలో విజయవాడ నుంచి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, డైరెక్టర్ ఎల్వికే రెడ్డి, రాష్ట్రం నలుమూలల నుండి పాత్రికేయులు పాల్గొన్నారు. 


Comments