మణిపూర్ నుండి క్షేమంగా ఆంధ్రాకు చేరుకున్న విద్యార్థులు..

 మణిపూర్ నుండి క్షేమంగా ఆంధ్రాకు చేరుకున్న  విద్యార్థులు..



- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏపీ విద్యార్థులను రిసీవ్ చేసుకున్న రాజమండ్రి ఎంపీ భరత్


- మిగిలిన విద్యార్థులూ ఈ అర్థరాత్రికి హైదరాబాదు చేరుకుంటారు: ఎంపీ భరత్


రాజమండ్రి, మే 8 (ప్రజా అమరావతి):  మణిపూర్ లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ విద్యనభ్యసిస్తున్న ఆంధ్రాకు చెందిన విద్యార్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక విమానాల ద్వారా సోమవారం మధ్యాహ్నానికి హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రిసీవ్ చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎంపీ భరత్ వెళ్ళి ఆంధ్రా విద్యార్థులకు ఆహ్వానం పలికారు. విద్యార్థినీ విద్యార్థులతో ఎంపీ మాట్లాడారు. మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణా కు చెందిన 214మంది విద్యార్థులు విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మణిపూర్ నుండి విమానంలో క్షేమంగా చేరుకున్నారని తెలిపారు. వీరిలో ఆంధ్రాకు చెందిన 108 మంది ఉన్నారని తెలిపారు. వీరినందర్నీ వారి వారి గమ్య స్థానాలకు 15 బస్సులో చేర్చడానికి సీఎం జగన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. మిగిలిన విద్యార్థులను కూడా ఈ అర్థరాత్రికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు విమానంలో చేరుకుంటారని ఎంపీ తెలిపారు. మణిపూర్ లో ఉన్న ఆంధ్రా విద్యార్థులందర్నీ ఏ ఒక్కర్నీ వదలకుండా ఏపీకి తిరిగి తీసుకురావడానికి సీఎం జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. మణిపూర్ నిట్, వ్యవసాయ విశ్వ విద్యాలయంలో సుమారు 157 మంది ఏపీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. మణిపూర్ లో అల్లర్ల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏపీ ప్రభుత్వాన్ని కోరగా సీఎం జగన్ వెంటనే స్పందించి, ఖర్చు కోసం వెనుకాడకుండా ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడి సమాచారం రప్పించుకుంటూ తగిన సహాయక చర్యలు తీసుకున్నారని ఎంపీ భరత్ తెలిపారు. న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాట్లు చేశారని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారన్నారు. ఎప్పటికప్పుడు సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రా విద్యార్థులను‌ వారి స్వస్థలాలకు చేర్చడానికి బస్సులను ఏర్పాటు చేసినట్టు ఎంపీ తెలిపారు.

Comments