అమెరికాలోని ఎన్నారైలందరి దృష్టి ఇప్పుడు వెనిగండ్లపైనే.

 *- అమెరికాలోని ఎన్నారైలందరి దృష్టి ఇప్పుడు వెనిగండ్లపైనే* 


 *- ఎన్టీఆర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడమే కారణం*

 *- గుడివాడను కైవసం చేసుకునేందుకు వ్యూహాలకు పదును* 

 *- అట్లాంటా సభ దృష్టికి గుడివాడ వెనుకబాటుతనం* 

 *- ఉద్యోగాలకు ఎన్నారైల సహకారం కోరిన వెనిగండ్ల*

 *- ఎన్నారైలను ఆకట్టుకుంటున్న వెనిగండ్ల సేవా, పార్టీ కార్యక్రమాలు* 

 *- టీడీపీ గెలుపు బాధ్యతను భుజాన వేసుకుందామని పిలుపు*

 *- అట్లాంటా వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వెనిగండ్ల* గుడివాడ, మే 16 (ప్రజా అమరావతి): అమెరికాలోని అట్లాంటాలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో అక్కడున్న తెలుగు ఎన్నారైలందరి దృష్టి ఇప్పుడు టీడీపీ నేత వెనిగండ్ల రాముపైనే ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం నుండి వెనిగండ్ల ప్రాతినిధ్యం వహిస్తుండడమేనని తెలుస్తోంది. అమెరికాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్న వేళ ఎన్టీఆర్ పోటీచేసి గెలుపొందిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నారైల మధ్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా ఎన్నారైలు సైతం వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు వెనిగండ్ల కూడా తనదైన శైలిలో గుడివాడ నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని అట్లాంటా సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ నియోజకవర్గంగా నేటికీ పిలుచుకునే గుడివాడ గత 20ఏళ్ళుగా అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉందని, ఏదైనా అభివృద్ధి జరిగితే ఎన్టీఆర్ హయాంలోనే జరిగిందంటూ వెనిగండ్ల అనేక సమస్యలను ఎన్నారైలకు వివరించడం జరిగింది. ఉద్యోగాల్లేక గుడివాడ యువత పడుతున్న ఇబ్బందులను కూడా అట్లాంటా వేదికపై వెనిగండ్ల ఏకరువు పెట్టారు. తనవంతుగా గుడివాడలో మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఐదారు నెలల్లోనే ప్రముఖ కంపెనీల్లో దాదాపు 2వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పించానని చెప్పగలిగారు. ఇక నుండి ప్రతి ఏటా ఐదారుగురిని ఉద్యోగాల కోసం గుడివాడ నుండి అమెరికాకు పంపించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. రిక్వైర్మెంట్ ఉన్నవారు గుడివాడ యువతకు ఉద్యోగాలివ్వాలని ఎన్నారైల సహకారాన్ని కూడా వెనిగండ్ల కోరారు. దీనిపై ఎన్నారైల నుండి సానుకూల స్పందన కూడా రావడం విశేషం. ఇదే సందర్భంలో గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవాకార్యక్రమాలతో పాటు చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కూడా వెనిగండ్ల వివరించగలిగారు. అన్నా క్యాంటీన్ల ద్వారా నిత్యం గుడివాడ నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి తీర్చడం, మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడం, యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడం, ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఎన్నారైలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో టీడీపీని గెల్పించుకోవడం చారిత్రక అవసరంగా వెనిగండ్ల గుర్తుచేశారు. స్వగ్రామాలపై దృష్టి పెట్టడంతో పాటు ఆలోచనలను గ్రామస్థులతో పంచుకోవాలంటూ ఎన్నారైలకు వెనిగండ్ల ఇచ్చిన పిలుపునకు సానుకూల స్పందనే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడంతో పాటు ప్రచారం కూడా చేయాలని వెనిగండ్ల సూచించారు. అలాగే గెలుపు బాధ్యతను కూడా భుజాన వేసుకుందామంటూ వెనిగండ్ల చేసిన ప్రకటన ఎన్నారైల్లో మరింత ఉత్సాహాన్ని నింపినట్టైంది. మొత్తం మీద అమెరికాలోని అట్లాంటాలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎన్టీఆర్ నియోజకవర్గం గుడివాడ టీడీపీ సీటును ఆశిస్తూ సేవా, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్న వెనిగండ్ల మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పొచ్చు.

Comments