*'తుంగభద్ర' చరిత్రలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం సీఎం జగన్ పరిపాలనలోనే : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
*
*జూలై 15 కల్లా 'హగరి అక్వెడిక్ట్' శాశ్వత పునరుద్ధరణ పనులు పూర్తి*
కర్నూలు జిల్లా, జూన్, 13 (ప్రజా అమరావతి); జూలై 15 కల్లా 'హగరి అక్వెడిక్ట్' శాశ్వత పునరుద్ధరణ పనులు పూర్తి చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.'తుంగభద్ర' చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి, నీటి వినియోగం నమోదైన సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో కావడం విశేషమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హోస్పేట్ లోని 'తుంగభద్ర' డ్యామ్ ని పరిశీలించారు. 1980-81 ఏడాదిలో 216.646 టీఎంసీలు మొదటి అత్యధిక నీటి వినియోగంగా నమోదయిందని .. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎప్ జగన్ పరిపాలనలో వరుసగా గత రెండేళ్లు 2021-22 లో 208.617 టీఎంసీలు, 2022-23 వత్సరంలో 190.432 టీఎంసీల వినియోగం జరిగిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. 2021-22 ఏడాదికి గానూ 205.203 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి , ఆ తర్వాత ఏడాది 2022-23లోనూ 193.26 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరగడం కూడా సీఎం వైఎస్ జగన్ హయాంలోనని మంత్రి ప్రస్తావించారు. తుంగభద్ర చరిత్రలో అత్యధిక ఇన్ ఫ్లో కూడా గత రెండేళ్ల కాలంలోనే కావడం గమనార్హమన్నారు. తుంగభద్ర డ్యామ్ వద్ద పీపీపీ మోడల్ లో 'మల్టీ మీడియా లేజర్ షో,రోప్ వే' ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆర్ బీఎల్ఎల్ సీకి(Right Bank Low Level Canal), ఆర్ బీహెచ్ఎల్ సీ (Right Bank High Level Canal) సంబంధించిన ఆధునికీకరణ పనులు టెండర్ల దశలో ఉన్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ప్రస్తుతం జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 5.024 టీఎంసీలని తెలిపారు. 'తుంగభద్ర' డ్యామ్ పరిశీలన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, తుంగభద్ర బోర్డు ఎస్.ఈ శ్రీకాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నీలకంఠ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
addComments
Post a Comment