అరుణాచలం యాత్రకు ఏపీ సి ఆర్ టి సి బస్సు సర్వీసులు

 విజయవాడ (ప్రజా అమరావతి);            దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో “అరుణాచలం” ఒకటి.  తిరువన్నామలై (అరుణాచలం)లో అరుణాచలేశ్వరడుని “అగ్ని/తేజో” లింగం గా భక్తులు ఆరాధిస్తారు. ఇక్కడ అరుణగిరి కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టుగా భావిస్తారు.  ముఖ్యంగా ప్రతి  పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ, స్వామి వారి దర్శనం కొరకు భక్తులు ఎక్కువగా అరుణాచలం చేరుకుంటారు.


ప్రయాణీకులు పౌర్ణమి ముందు రోజు వివిధ ప్రాంతముల నుండి  బయలుదేరి, పౌర్ణమి నాడు తిరువన్నామలై చేరి గిరి ప్రదక్షిణ గావించి, శివదర్శనంచేసుకొని తిరుగు ప్రయాణమవుతూ ఉంటారు. 


APSRTC తిరువన్నామలై ( అరుణాచలం) పుణ్య క్షేత్రానికి భక్తుల సౌకర్యం కొరకు మొదటి సారి 2022 అక్టోబర్ 9 న  గిరి ప్రదక్షిణ కొరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయటమైనది. అక్టోబర్ 2022 నుండి మార్చి 2023 వరకు  6 నెలల్లో  338 ప్రత్యేక బస్సులు వివిధ డిపోల నుండి ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సౌకర్యార్ధం  నడపటం జరిగినది. APSRTC వారి బస్సు సదుపాయం అందుబాటు ధరలో ఉండటం మరియు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వలన భక్తుల నుండి విశేష స్పందన లభించింది.


భక్తుల నుండి వచ్చిన విశేష స్పందన మరియు ఆదరణ మేరకు ఏప్రియల్ 2023 నుండి జూన్ 2023 వరకు, కేవలం 3 నెలల్లో  483 ప్రత్యేక బస్సులు నడపడం జరిగింది. వైశాఖ పౌర్ణమి (తేది 05.05.2023) నాడు ఒక్క రోజు 196 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.  మొత్తం మీద గడిచిన 9 నెలల్లో 821 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా RTC,  రూll  3.50 కోట్లు ఆర్జించింది.


APSRTC ఏర్పాట్లు మరియు సేవలు వినియోగించుకున్న భక్తులందరికి ధన్యవాదములు తెలుపు కుంటూ రాబోయే మాసములలో APSRTC ఏర్పాటు చేయు బస్సులకు www.apsrtconline.in నందు ముందస్తు రిజర్వేషన్ చేసుకొని సేవలు సద్వినియోగము చేసుకొని పౌర్ణమి నాడు అరుణాచలేశ్వరుని దర్శించుకొనగలరని మనవి.

Comments