మొబైల్ టవర్లను ప్రారంభించిన సి.ఎం.

 


*మొబైల్ టవర్లను ప్రారంభించిన సి.ఎం


*


పార్వతీపురం, జూన్ 15 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్మాణం పూర్తయిన మొబైల్ టవర్లను రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురు వారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. గుమ్మలక్ష్మీపురం మండలం సికలబాయి, పాచిపెంట మండలం కుంటంబడేవలస గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ టవర్ల ఏర్పాటుతో డిజిటల్ విప్లవం వచ్చి గొప్ప మార్పుకు నాంది పలకనుందని అన్నారు. దీనితో ఇంకా మంచి జరగాలని ఆయన ఆకాక్షించారు. డిసెంబరు నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సూచించారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మొబైల్ టవర్ల ఏర్పాటుతో జిల్లాలో నూతన శకం ప్రారంభం అవుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4జి కవరేజ్ వస్తుందన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన 52 టవర్లను ఒకేసారి అటవీ అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఒక్కో టవరు ఏర్పాటుకు రూ.80 లక్షలు వరకు ఖర్చు చేయడం జరుగుతుందని, తద్వారా జిల్లాలో రూ.135 కోట్ల విలువ చేసే టవర్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతీ టవర్ నుండి అర కిలో మీటర్ నుండి 1.50 కిలోమీటర్ల దూరం వరకు సిగ్నల్స్ అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 


శాసన సభ్యులు పాముల పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతం విద్యా, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలకు కూడా దూరంగా ఉందని, కమ్యూనికేషన్ కు మరింత దూరంగా ఉన్నామన్నారు. గిరిజన అభివృద్ధికి కట్టుబడిన ముఖ్యమంత్రిగా, ప్రతి ఆలోచన గిరిజనుల అభివృద్ధి పైనే ఉండటం సంతోషదాయకం అన్నారు. నాడు నేడు పనులతో పాఠశాలలు, ఆసుపత్రుల రూపు రేఖలు మార్చారని అన్నారు. పథకాలతో గుండె గుండెకు చేరువ అయ్యారని ఆమె పేర్కొన్నారు. 


మొబైల్ వినియోగదారులలో పాలక సంధ్య మాట్లాడుతూ మేము అనుభవిస్తున్న కష్టాలు తీర్చేవారు లేరు అనుకున్నామని... నేను ఉన్నాను అంటూ మీరు వచ్చి అండగా ఉన్నానని నిరూపించారని అన్నారు. టవర్లను ఇచ్చి బయటి ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. పాఠశాలలలో పిల్లలను చేర్పించే సమాచారం ఫోన్ కు వస్తుందని అన్నారు. టవర్ల రాకతో సిగ్నల్స్ అందాయని పాఠశాలకు ఉపాధ్యాయులు ఎన్ని గంటలకు వస్తారో అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచం జరిగే వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తుందని అన్నారు. గతంలో గర్భిణీలు ప్రసవ సమయంలో ఏమి చేయాలో తెలిసేది కాదని, అంబులెన్సుకు పిలుచుకు వచ్చేసరికి ప్రసవం జరిగి పోయేదని... ఇప్పుడు 108కి ఫోన్ చేస్తున్నామని, కొద్ది సమయంలో వచ్చి ఆసుపత్రిలో చేర్చుతుందని, మరి కొద్ది సేపటికి తల్లీబిడ్డల క్షేమ సమాచారం ఫోన్ లో తెలుస్తుందని వివరించారు. ప్రతీ విషయానికీ చేదోడు వాదోడుగా మీరు ఉన్నారనే ధైర్యం మాకు కలిగిందని అన్నారు. పింఛన్ల పంపిణీకి సిగ్నల్స్ ఎంతో ఉపయోగ పడుతుందని, కొత్త జిల్లాగా పార్వతీపురం ఏర్పాటు చేసి అనేక వ్యయ ప్రయాసలను తగ్గించారని అభినందించారు. ఒక ఫోన్ కాల్ కొడితే చాలు ... అధికారులు వస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. మంచి పథకాలు ఇంకా పెట్టాలని.. సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆమె ఆకాక్షించారు. 


ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్,  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, గుమ్మలక్ష్మిపురం, కురుపాం మండల పరిషత్ అధ్యక్షులు కె. దీనమయ్య, శెట్టి పద్మావతి, ఉపాధ్యక్షులు ఎన్.శేఖర్, ఎన్. లక్ష్మణ రావు జెడ్పీటీసీలు ఎం.రాధిక, జి. సుజాత, ఎం.పి.టి.సి ఎం.రమణ,  సర్పంచ్ బి.రాజారావు, ఉప సర్పంచ్ బి.చిట్టెమ్మ , బిసి కార్పొరేషన్ డైరక్టర్ జి.గిరిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments