*ముఖ్యమంత్రి సారథ్యంలో వడ్డెర సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత : 'వడ్డెర'ఆత్మీయ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
*కుల వృత్తిమీద ఆధారపడే వారికి ఎటువంటి ఇబ్బంది రానీయం*
*స్వాతంత్ర్య పోరాట యోధుడైన'ఓబన్న' విగ్రహం ఏర్పాటు చేస్తాం*
*వృత్తిపరమైన ప్రమాదాల బారిన పడే వడ్డెర వృత్తిదారులకు ప్రత్యేక బీమా సదుపాయం అందించడంపై పరిశీలిస్తాం*
*వడ్డెర కులాన్ని ఎస్టీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు*
*ఇప్పటికే చాలావరకు ఇళ్ల పట్టాలు అందించాం.. ఇంకా ఎవరైనా అర్హులైన వారున్నట్లయితే పరిశీలించి వారికి కూడా పక్కాగా ఇళ్ల పట్టాలు అందిస్తాం*
*అందరికీ ఇళ్లు కట్టించే వడ్డెరలకోసం ప్రత్యేకంగా ఓ భవనం నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరు చేశాం*
డోన్, జూన్,09 (ప్రజా అమరావతి); ముఖ్యమంత్రి సారథ్యంలో వడ్డెర సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత అందించామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. చట్టసభలు, నామినేటెడ్ పదవులిచ్చి సముచిత స్థానం కల్పించినట్లు మంత్రి స్పష్టం చేశారు. తమ పనేదో తాము చేసుకునే రజక,నాయీ బ్రాహ్మణ, కుమ్మరి, వడ్డెరలలో అమాయకమైన బీసీ కులాలున్నాయన్నారు.వడ్డెర కులాన్ని ఎస్టీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదని, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని పేర్కొన్నారు.వృత్తిపరమైన ప్రమాదాల బారిన పడే వడ్డెర వృత్తిదారులకు ప్రత్యేక బీమా సదుపాయం అందించడంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సానుకూలంగా స్పందించారు.
వడ్డెర సామాజిక వర్గంలో స్ఫూర్తిని నింపిన..స్వాతంత్ర్య పోరాట యోధుడైన'ఓబన్న' విగ్రహం ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం జయంతి ఉత్సవాల నిర్వహించడంపైనా సమాలోచన చేస్తామని హామీ ఇచ్చారు. కుల వృత్తిమీద ఆధారపడే వారికి ఎటువంటి ఇబ్బంది రానీయకుండా పూర్తి సహకారం అందిస్తామన్నారు.అందరికీ ఇళ్లు కట్టించే వడ్డెరలకోసం ప్రత్యేకంగా ఓ ఆత్మగౌరవ భవనం నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి బుగ్గన ప్రస్తావించారు. ఇప్పటికే చాలావరకు వడ్డెర సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారున్నట్లయితే పరిశీలించి వారికి కూడా పక్కాగా ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది వడ్డెరలున్నారని , అందరిదీ ఒకే భాష, ఒకే మాట అని మంత్రి తెలిపారు.వడ్డెర సామాజిక వర్గ నేపథ్యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించిన తీరుపై సభలో కరతాళధ్వనులు వినిపించాయి. అది చేస్తాం..ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికే ప్రతిపక్ష పార్టీలను గతంలో అధికారం ఇచ్చిన సమయంలో ఏం చేశారో కచ్చితంగా ప్రశ్నించాలని మంత్రి బుగ్గన తెలిపారు.
శుక్రవారం నాడు డోన్ పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 'వడ్డెర' ఆత్మీయ సమావేశంలో ఎమ్ఎల్ సీ ఏసు రత్నం, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, వడ్డెర సంక్షేమ సంఘం డోన్ అధ్యక్షులు గోగుల నాగరాజు, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు,పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వల్లేపు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment