ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి.

 


*ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి


*


@వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకొని చేరుకునేందుకు కృషి చేయాలి

@నాడు - నేడు పనుల్లో వేగం పెంచాలి

@చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించిన కలెక్టర్


విజయనగరం(చీపురుపల్లి), జూన్ 09 (ప్రజా అమరావతి):- పేదలందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్ ఆదేశించారు. చీపురుపల్లి డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో నిర్దేశిత లక్ష్యాలు చేరుకునేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయ కృషి చేయాలని పేర్కొన్నారు. అలాగే నాడు నేడు పనుల్లో ఆశాజనక ఫలితాలు సాధించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో నాడు - నేడు, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఇతర అభివృద్ధి పనులపై శుక్రవారం చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు ప్రణాళికాయుత కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె మండలాల వారీగా అధికారులను, సచివాలయం ఇంజీరింగ్ అసిస్టెంట్లు లేపి అక్కడ సాధించిన ప్రగతి గురించి ఆరా తీశారు. నివేదికలను పరిశీలించి తగు సూచనలు చేశారు. వారం వారం స్టేజ్ అప్డేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అవసరం అనుకుంటే లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ప్రోత్సహం అందించాలని చెప్పారు. ఇటీవల వచ్చిన కొత్త డి.పి.ఆర్.కు అనుగుణంగా పని చేయాలని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. రాజాం నియోజకవర్గ పరిధిలో 85 శాతం

లక్ష్యాలను మాత్రమే చేరుకున్నారని.. ఇది సరిపోదని శత శాతం చేరుకోవాలని నిర్దేశించారు. తక్కువ పురోగతి సాధించిన గ్రామాల్లో మరొకసారి అన్ని విభాగాల అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒక సారి నూతన లక్ష్యాలు వస్తాయని వాటికి అనుగుణంగా అందరూ పని చేయాలని సూచించారు.


నాడు - నేడు మన బడి పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని పాఠశాలలు పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, టాయ్లెట్, కిచెన్ షెడ్స్ పనులను వీలైనంత వేగంగా ముగించాలని చెప్పారు. జిల్లాలో 390 పాఠశాలల్లో ఇంటరాక్టివ్ కిట్ ఏర్పాటు చేయాల్సి ఉంది కాబట్టి సంబంధిత పనులను ముందుగా చేయాలని సూచించారు.


పంచాయతీ రాజ్ విభాగం పరిధిలో చేయాల్సిన పనులను త్వరితగతిన ముగించాలని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. నాడు - నేడు పనులు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులు పూర్తి అయినా వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు.


*నాడు-నేడు ఉపకరణాలను స్థానికంగా కొనుగోలు చేసుకోండి*


పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో భాగంగా అవసరమైన విద్యుత్, టాయ్లెట్, టైల్స్ ఉపకరణాలను స్థానికంగా కొనుగోలు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇండెంట్ పెట్టుకొని నిబంధనలు ప్రకారం వస్తువులను కొనుగోలు చేసుకొని పనులను వేగంగా ముగించాలని చెప్పారు. వీటికి సంబంధించి ఆర్థిక వనరులను ముందుగానే చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.


సమావేశంలో చీపురుపల్లి ఆర్డీవో అప్పారావు, గృహ నిర్మాణ శాఖ పి.డి. రమణ మూర్తి, డి.ఈ.వో. లింగేశ్వర రెడ్డి, అన్ని మండలాల ఎంపీడీఓలు, గృహ నిర్మాణ, ఇతర శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



Comments