*డీజీ స్థాయిలో తనిఖీలు అవసరం
*
*ఔషధ నియంత్రణ శాఖ మరింత పటిష్టంగా పనిచేయాలి*
*నకిలీ మందుల విషయంలో అప్రమత్తత అవసరం*
*జోనల్ కార్యాలయ ఏర్పాటుకు కేంద్రానికి లేఖ రాయండి*
*సీజర్ కేసుల్లో పురోగతి ఉండాలి*
*సీఆర్ యూ ను బలోపేతం చేయండి*
*అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడండి*
*రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాల ఏర్పాటును పరిశీలించండి*
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని*
*ఔషధ నియంత్రణ శాఖపై సమీక్ష*
అమరావతి (ప్రజా అమరావతి);
ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ మందులు, నాణ్యత లేని మందులు, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడం లాంటి అంశాలకు సంబంధించి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణ శాఖ కు సంబంధించి మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం మంత్రి విడదల రజిని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఔషధ నియంత్రణ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఎలా వాడుకోవచ్చో పరిశీలించాలని కోరారు. నకిలీ మందుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, హోల్‌సేల్ షాపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఔషధ నియంత్రణ శాఖలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి సంబంధించి నివేదిక తయారుచేయాలన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఔషధ నియత్రణ శాఖకు సంబంధించి వారి ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సంబంధిత అధికారులకు లేఖ రాయాలని, తాను కూడా కేంద్రాన్ని కోరతానని తెలిపారు.
*విజిలెన్స్ బృందాల ఏర్పాటుకు చర్యలు*
ఔషధాల చెలామణిలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్ బృందాలను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి విడదల రజిని చెప్పారు. ఔషధాల అక్రమ చెలామణి, ఇతర అవినీతి కార్యకలాపాలకు సంబంధించి ఏర్పాటుచేసిన సీఆర్ యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మెడికల్ షాపుల్లో పనిచేసే ఫార్మాసిస్టుల జియోట్యాగింగ్ విషయాన్ని పరిశీలించాలన్నారు. నిషేధిత మందులను పూర్తిస్థాయిలో అరికట్టడం, నకిలీ మందులు లేకుండా చూడటం ఔషధ నియంత్రణ శాఖలో అందరి కర్తవ్యమని చెప్పారు. ఆ దిశగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఔషధ నియంత్రణశాఖకు కొత్త డీజీ గా బాధ్యతలు చేపట్టిన కొల్లి రఘురామిరెడ్డి మంత్రిని ప్రత్యేకంగా పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఔషధ నియంత్రణశాఖ జేడీ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment