పామర్రులో అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్ అందచేత.విజయవాడ (ప్రజా అమరావతి);*పామర్రులో అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్ అందచేత


*

 - *బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన హోంమంత్రి తానేటి వనిత*


పామర్రు నియోజకవర్గం పామర్రు మండలం నిభానుపూడిలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని సోమవారం రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మేరకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్టపరిహారం చెక్ ను ఆ కుటుంబానికి అందజేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి అండగా నిలుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని, ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణతాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ లేదన్న బాధను ఎవరూ పూడ్చలేరని, ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని మైనర్ బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా.. తన, మన అనే భేదం లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన శిక్షలు విధిస్తామన్నారు. పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందన్నారు. బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి నిందితుల పట్ల కఠినంగా శిక్షలు పడేలా చూస్తున్నామన్నారు. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలతో రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పామర్రు శాసన సభ్యులు కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. Comments