రానున్న77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయండి:సిఎస్.

 రానున్న77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయండి:సిఎస్


అమరావతి,21 జూలై (ప్రజా అమరావతి):ఆగస్టు 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో ఆయా శాఖల పరంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.అదే విధంగా అదేరోజు సాయంత్రం రాజ్ భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నిటినీ ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ మరియు విజయవాడ పోలీస్ కమీషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఇప్పటి వరకూ శకటాల ఏర్పాటుకు వచ్చిన శాఖల వివరాలను అందజేయాలని సమాచార శాఖ కమీషనర్ ను ఆయన ఆదేశించారు.ఈవేడుకలకు హాజరయ్యే అతిధులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ సహా ఆయా విభాగాల అధికారులను సిఎస్ జహవర్ రెడ్డి ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్ భవన్,హైకోర్టు,అసెంబ్లీ,సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుత్ దీపాలంకరణతో అలంకరించాలని సిఎస్ ఆదేశించారు.

వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు,ట్రాఫిక్ నిర్వహణ,సెరిమోనియల్ డ్రైవ్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈఏర్పాట్లన్నింటిని విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా,ఎపిఎస్పి అదనపు డిజిపిలు ఎపిఎస్పి,శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు.

వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై శకటాల ప్రదర్శనకు ఇప్పటి వరకూ 13 శాఖలు ముందుకు వచ్చాయని పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వివరించారు.ఈవేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా ప్రత్యేక వీడియో తెరలను ఏర్పాటు చేయడం తోపాటు ఆల్ ఇండియా రేడియో,దూరదర్శన్ సహా వివిధ చానాళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.అదే విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ముఖ్యఅతిధి వారికి సందేశం సిద్ధం చేయడంతో పాటు పటిష్టమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం వంటి ఇతర ఏర్పాట్లన్నీ చేయనున్నట్టు సిఎస్ కు వివరించారు.వేడుకల అనంతరం ఆయా శకటాలను ప్రజల్లో అవగానకై విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు,బందరు రోడ్డుల్లో తిప్పనున్నట్టు అందుకు తగిన ట్రాఫిక్ నిర్వహణ చేయాల్సి ఉందని చెప్పారు.దానిపై సిఎస్ జవహర్ రెడ్డి స్పందించి విజయవాడ పోలీస్ కమీషనర్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 

వీడియో లింక్ ద్వారా పాల్గొన్నఎన్టీఅర్ జిల్లా కలక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ వేడుకల నిర్వహణకు వీలుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.గత ఏడాది సుమారు 5వేల మందికి పైగా వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులను,ఎన్సిసి,స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర విద్యార్ధులను వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తీసుకువచ్చామని ఈఏడాది కూడా అదే తరహా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు.విజయవాడ పోలీస్ కమీషనర్,మున్సిపల్ కమీషనర్ల తదితర అధికారుల సమన్వయంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతానికి తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజున నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, బందోబస్తు ఇతర ఏర్పాట్లన్నీపటిష్టంగా చేపట్టనున్నట్టు చెప్పారు.విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ పెద్దఎత్తున పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.ఇంకా ఎపిట్రాన్సుకో,ఆర్టీసీ,వైద్య ఆరోగ్యం,ఉద్యానవనం,డిజి ఫైర్ సర్వీసెస్,ఆర్ అండ్బి తదితర విభాగాల అధికారులు వారి శాఖల పరంగా చేపడుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

అంతకు ముందు రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం సంచాలకులు యం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసమావేశంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్.ఆర్)చిరంజీవి చౌదరి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Comments