ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో BLA ల పాత్ర కీలకం:- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.*ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో BLA ల పాత్ర కీలకం:- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జులు, పరిశీలకులు, పార్లమెంట్/మండల అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, క్లస్టర్ /యూనిట్ ఇన్‌ఛార్జ్‌లతో  మంగళవారం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 21వ తేది నుంచి ఆగష్టు 20వ తేది వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో గ్రామస్థాయిలోని ప్రతి ఒక్క బిఎల్‌ఏ (BLA) డోర్  టు డోర్ ప్రోగ్రాం లో పాల్గొని జాబితా సవరణపై వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చంద్రబాబు సూచించారు. గ్రామస్థాయిలో అధికార పార్టీ నేతలు కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని, ఇటువంటి తప్పులు గుర్తించిన బిఎల్ఏలు, పార్టీ నాయకులు వెంటనే పార్టీ కార్యాలయంకు వాట్సాప్ ద్వారా (9182981134) సమాచారాన్ని పంపించాలన్నారు. జాబితా సవరణలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదు అని, నిబంధనలకు విరుద్ధంగా  ఎవరైనా జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడితే  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం లో ప్రజలను భాగస్వాములను చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కీలకమైన ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పనిచేసే ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకుంటామని, వారికి పార్టీలో సముచితమైన గౌరవం ఇస్తామన్నారు. అధికార పార్టీ నేతల అరాచాకాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని, టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు గ్యారెంటీ, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments