*రాష్ట్ర సచివాలయంలో ఘనంగా మహిళల ఆత్మ గౌరవ దినోత్సవం*
*•సమాజంలో మహిళ పట్ల ఉన్న చులకన భావంలో మార్పు రావాలి*
*•సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలి*
*రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ*
అమరావతి, జులై 14 (ప్రజా అమరావతి): సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలని రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరిచే అంశంపై సమాజంలో చర్చ జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మహిళల ఆత్మ గౌరవ దినోత్సం (Women’s Dignity Day) ఆమె అద్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రస్తుతం మన సమాజంలో సోషల్ మీడియా పిచ్చి పోకడల నేపథ్యంలో ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి ఏడాది మార్చి 8 వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుచున్నదని, అయితే ఇప్పటి నుండి ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలు ఏమాత్రం వెనుకబడి లేరన్నారు. ఆటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని ఎంతో చాకచక్యంతో సమన్వయం చేసుకుంటూ మహిళలు ఎంతో అద్బుతంగా రాణిస్తున్నారన్నారు. అయితే మద్యయుగాలాంటి మానసిక దోరణిలో నుండి సమాజం బయటకి రాకపోవడం వల్ల మహిళలు పలు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుచున్నదన్నారు. పలు రంగాల్లో సమర్థవంతంగా ముందుకు వెళ్లే మహిళలను మరియు ఎటు వంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించే మహిళలను కించపరిచే విధంగా చాలా నీచంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే దోరణి రోజు రోజుకు పెరిగిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగంగా మహిళలను కించపరిస్తే ఎవరూ ఊరకోరని, అయితే బయటి సమాజంలో చెల్లని బూతులు, మాటలు సోషల్ మీడియాలో ఎలా చెల్లుబాటు అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో కూర్చోని చేతులోనున్న ఫోను ద్వారా ఇష్టాను సారం మహిళలను కించపరిచే విధంగా పోస్టింగులు పెట్టే హక్కు ఎవరికీ లేదనే అంశంపై చర్చ జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినాన్ని పాటించడం జరుగుచున్నదన్నారు. ఈ విధంగా చర్చ జరగడం ద్వారా సమాజంలో తప్పక మార్పు వస్తుందని, మహిళలను కించపరిచే వారిని వేలు ఎత్తి చూపే పరిస్థితి తప్పక ఏర్పతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారతకు మరియు మహిళల ఆర్థిక స్వావలంబనకై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను, కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. అన్ని రకాల పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలోనూ, దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించడం లోనూ, ప్రతి పథకం మహిళల పేరునే మంజూరు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దైర్యంగా ముందుకు వెళుతున్నదన్నారు. ఇటు వంటి నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా గానీ, మరే మార్గాల ద్వారా గాని ఎన్ని ఆటంకాలు ఏర్పడిగా మహిళలు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి వారు సహకరించాలని కోరుకుంటూ, ప్రతి శుక్రవారం నిర్వహించే మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగులు అంతా సంతకాలతో తమ మద్దతను తెలియజేశారు.
రాష్ట్ర సచివాలయంలోని మహిళా ఉద్యోగినులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment