రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
** బడి ఈడు గల బాలబాలికలందరూ విధిగా బడికి చేరి చదువుకోవాలి.
** గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పై ప్రత్యేక దృష్టి.
** పదవ తరగతి పరీక్షల్లో తప్పిన వారికి కూడా రెగ్యులర్ విద్యార్థి గా అవకాశం.
..జిల్లా కలెక్టర్ కె మాధవీలత.
జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి బడి బయట ఉండరాదని, బడి ఈడు గల బాలబాలికలందరూ విధిగా బడికి చేరి చదువుకునేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత విద్యాశాఖాధికారులను ఆదేశించారు .
బుధవారం స్థానిక నాగరాజా నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు, విద్యాశాఖ అధికారులతో కలసి పర్యవేక్షించి, బడి బయట పిల్లలను తిరిగి బడిలో చేర్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, నమోదు, నిలకడ నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ..జి ఈ ఆర్) సమతూకం లో ఉండేలా చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత అన్నారు. పాఠశాల లో చేరిన ప్రతి విద్యార్థి తన చదువును విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత చదువులకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని, మధ్యలో ఏ ఒక్కరూ.. ఏ కారణంతోనూ చదువు మానేయడానికి వీలులేదని కలెక్టర్ అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మార్చి నెలలో తప్పిన వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టి పై చదువులకు వెళ్లే అవకాశం కల్పించారు. తద్వారా విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆ సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా తప్పిన విద్యార్థి, సమయాన్ని బయట వృధాగా గడపకుండా తిరిగి రెగ్యులర్ విద్యార్థి గా పాఠశాల లో పదిలో చేరే అవకాశం కల్పించడం ముదావహం అన్నారు. పదవ తరగతి తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శానిటోరియం అంగన్ వాడీ కేంద్రం నుండి బి. పూజిత, పి. జస్విన్ లను శ్రీ నాగరాజా ప్రాధమిక పాఠశాలలో ఒకటవ తరగతి లో చేర్చారు. శ్రీ నాగరాజా ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 8వ తరగతి చదివి మధ్యలో బడి మానివేసిన దుప్పాడ ఉమశ్రీని తిరిగి 8వ తరగతిలో జాయిన్ చేయడం జరిగిందని కలెక్టరు అన్నారు.
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పిన కుప్పిలి అశ్విని అనే విద్యార్థిని ఆనంద నగర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించడం జరిగిందని, జె.భవాని గణేష్, వై.తులసి గౌరీ, ఐ.చిన్నికృష్ణ లను ఎస్ కె.వి టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డిఐ ఆఫ్ స్కూల్స్ బి.దిలీప్ కుమార్, శ్రీ నాగరాజా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.చక్రధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని మోటూరి మంగారాణి, ఎస్.కెవిటిప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్.వి ఎమ్.సుబ్రహ్మణ్యం,తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment