ఎస్వీ మ్యూజియం అభివృద్ధి ప‌నుల పూజలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్.

 ఎస్వీ మ్యూజియం అభివృద్ధి ప‌నుల పూజలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్


తిరుమ‌ల‌,  ఆగస్టు 11 (ప్రజా అమరావతి): తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులకు శుక్రవారం నిర్వహించిన పూజల్లో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న‌ కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. పూజలు చేసిన అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన మ్యూజియాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను, ఆలయ పురాతన సంప్రదాయాలు, సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను యాత్రికులకు తెలియ‌జేయ‌డ‌మే మ్యూజియం ప్ర‌ధాన లక్ష్యమ‌న్నారు. యాత్రికుల‌కు ఇక్క‌డ శ్రీ‌వారి ఆల‌య సంద‌ర్శ‌న దివ్యానుభూతిని అందిస్తామ‌న్నారు. విరాళం ప్రాతిపదికన రూ.145కోట్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చినందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మ్యాప్ సిస్టమ్స్ సంస్థ‌ల‌కు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 19 గ్యాలరీలు ఉన్నాయ‌ని, వాటిలో ఐదింటిని బెంగళూరుకు చెందిన మ్యాప్‌ సిస్టమ్స్ రూ.20 కోట్లతో, మిగిలిన 14 గ్యాలరీలను టిసిఎస్‌ రూ. 125 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయ‌ని చెప్పారు. ఈ ప‌నులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయ‌ని తెలియ‌జేశారు.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో మ్యూజియం అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉన్నాయ‌ని, వీటిని బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ వారు అభివృద్ధి చేస్తున్నార‌ని చెప్పారు. మిగిలిన గ్యాల‌రీల‌ను టిసిఎస్ సంస్థవారు ఆధునీకరణ చేస్తున్నార‌ని వివ‌రించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో శ్రీ వేంకటేశ్వరుడి రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేల గ్యాలరీలు ఉన్నాయ‌న్నారు. మొదటి ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు- వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు కొలువుతీరి భక్తులను అబ్బురపరిచేలా తీర్చిదిద్దుతామ‌న్నారు. రెండవ ఫ్లోర్‌లో విరాట్ పురుషుడు, బ్రహ్మ, మహేశ్వరులు, ఋగ్వేదం యజుర్వేదం గ్యాలరీలు ఉన్నాయ‌ని, మూడో ఫ్లోర్‌లో బ్రహ్మాండ గ్యాలరీ కొలువై ఉంద‌ని చెప్పారు.

మ్యూజియం పైభాగంలో 17 పెద్ద గోపురాలు ఉన్నాయ‌ని, వీటిలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ పురందరదాస, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ శంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి భక్తాగ్రేసరులతో పాటు రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి మహాగ్రంథాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శిస్తామ‌ని వివ‌రించారు. మ‌రుగున ప‌డిన స‌నాత‌న ధార్మిక అంశాల‌ను భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించేందుకు మ్యూజియం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. అంతకుముందు టీటీడీ ఈవో ఎస్వీ మ్యూజియం నిర్మాణ ప్రణాళిక, డిజైన్‌ను డిస్‌ప్లే ద్వారా ఛైర్మన్‌కు వివరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, మ్యూజియం అధికారి శ్రీ కృష్ణారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, చీఫ్ ఆడిట్ అధికారి శ్రీ శేష శైలేంద్ర, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధరరావు, టిసిఎస్ సంస్థ నుండి శ్రీ భీంశేఖర్ ఇత‌ర బృంద సభ్యులు, మ్యాప్‌ సిస్టమ్స్‌కు చెందిన శ్రీ సతీష్ తో పాటు బృంద స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments