దేశానికి ఆదర్శంగా భూముల రీ సర్వే .

 

ఆత్మకూరు. ఆగస్ట్.10 (ప్రజా అమరావతి);


 నాలుగేళ్లలో 

రెవెన్యూ వ్యవస్థలో  అనేక సంస్కరణలు 


* దేశానికి ఆదర్శంగా భూముల రీ సర్వే * వందేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యకు పరిష్కారం


*- 20 ఏళ్లు గా ఎటువంటి హక్కులు లేకుండా సాగు చేస్తున్న రైతుల భూములకు హక్కులు 


*- 12800 కోట్లతో రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం.*


* డబుల్ రిజిస్ట్రేషన్లు లేకుండా రిజిస్ట్రేషన్ చట్టం లో సవరణ 


*- ఇకపై గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు*


ఆత్మకూరు రెవెన్యూ సదస్సు లో

* రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు* వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు అన్నారు.

గురువారం ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ సదస్సు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


ఈ సంద‌ర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అనేక కార్యక్రమాలు రెవెన్యూ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే సుమారు వంద ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని, 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించామని చెప్పారు.  ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూమికి ఆ సాగుదారుడ్నే యజమానిని చేసే కార్యక్రమాన్ని అధికారికంగా చేప‌ట్టామని చెప్పారు. భూమిని ప్రజల వద్దకు చేర్చాలనే, ఆ భూమి వల్ల వారి స్థితిగతులు మారాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్య‌క్ర‌మాల వల‌న ఇవాళ పేదలు, రైతుల గౌరవం పెరిగిందని, ఆర్థిక పరిస్థితి మారిందని, భరోసాగా జీవిస్తున్నారని ఇదంతా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దృఢమైన నాయకత్వం, స్థిరమైన ఆలోచనలు, విశాల భావజాలం వ‌ల‌నే సాధ్యం అయిందన్నారు. 


  ఆత్మకూరులో సుమారు 20 వేల ఎక‌రాలు చుక్కల భూములకు సంబంధించి రైతులకు హక్కులు కలిపిస్తున్నామని, మరో 6 వేల ఎకరాలు కూడా  త్వరలో పూర్తి చేస్తామన్నారు.  పార్టీల‌కు అతీతంగా ప్రాంతాల‌కు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని, కుల‌,మ‌తాల‌కు అతీతంగా ప‌థ‌కాల‌ను వ‌ర్తింప జేస్తున్నామన్నారు. అర్హ‌తే ప్రామాణికంగా ఇన్ని మంచి ప‌నులు చేస్తున్నట్లు చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ.12 వేల800 కోట్లు వెచ్చించి 32 లక్షల మందికి ఇళ్ళ స్తలాలు ఇచ్చామని చెప్పారు. 


 ఇనాం భూముల య‌జ‌మానులకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తున్నామని, ఎలిజిబుల్ రైట్స్ ఇస్తున్నామని, ఆత్మకూరులో కూడా 2700 ఎకరాల భూమి కి ఎలిజిబుల్ రైట్స్ కల్పిస్తున్నామని చెప్పారు. 


భూవివాదాలను శాశ్వతంగా పరిశీలించేందుకు వందేళ్ళ అనంతరం భూముల రీసర్వేకు 1500 కోట్లతో శ్రీకారం చుట్టామని,   ఆధునిక యంత్ర ప‌రిక‌రాల‌తో పూర్తి స్థాయిలో నిష్పాక్షిక ధోర‌ణిలో స‌ర్వే చేస్తున్నామన్నారు. 

ఈ స‌ర్వే దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని,  మనం చేపడుతున్న సర్వే ని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా హద్దు రాళ్ళు వేసి,డాక్యుమెంట్లు ఇస్తున్నామన్నారు. 


డబల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ చట్టం లో కూడా మార్పు తీసుకు వచ్చామని, దీంతో రిజిస్ట్రేషన్ అయిన వెటనే మ్యుటేష‌న్ అయ్యేలా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామన్నారు. ప్రతి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. 


ప్రజలకు, రైతులకు మేలు చేసే శాఖగా రెవిన్యూ శాఖ : కలెక్టర్


జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అమలు చేసే శాఖ నుంచి ప్రజలకు, రైతులకు మేలు చేసే శాఖగా రెవెన్యూ శాఖ గుర్తింపు పొందిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో రీసర్వే కింద 118 గ్రామాల్లో భూముల సర్వే పూర్తి చేసి రైతులకు భూ హక్కు పత్రాలు అందించామని చెప్పారు.మిగిలిన 40 గ్రామాలలో త్వరలో పూర్తి చేస్తామన్నారు. చుక్కల భూములకు సంబంధించి 43 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పించి ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు చెప్పారు.  భూములకు పూర్తి హక్కులు కల్పించి రైతులకు సంతోషం నింపడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామస్థాయిలోని అనేక సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తున్నట్లు చెప్పారు. గతంలో మండలానికి ఒక సర్వేయర్ వుండే వారని , ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ ఉన్నారన్నారు.


రెవెన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి

- ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వీఆర్వోలు, వాలంటీర్లతో రెవెన్యూ సమస్యలపై ఇంటింటి సర్వే చేపట్టామని, ఈ సర్వేలో వెలుగు చూసిన రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అసాధారణ నిర్ణయాలతో ఆత్మకూరు నియోజకవర్గం లోని రైతులకు ఎంతో మేలు చేకూరిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూములు, సాదా బైనామా, అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పించడం పట్ల రైతులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారురని చెప్పారు. 

ఆత్మకూరు పట్టణం లో జరిగిన రెవెన్యూ సదస్సు లో చుక్కల భూముల పై హక్కులు కల్పిస్తూ ధృవీకరణ పత్రాలు అందజేశారు.


 స్వమిత్వ ఆస్తి కార్డులను మంత్రి కలెక్టర్ ,ఎమ్మెల్యే అందజేశారు. 


ఈ సదస్సులో నియోజక వర్గ పరిశీలకుడు ,గూడ చైర్ మన్ గురు మోహన్, మాజీ ఎమ్మెల్సీ B. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడారు. ఈ సదస్సు లో

,జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, ఆర్డిఓ కరుణ కుమారి, డిపిఓ సుస్మిత, ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరమణమ్మ,  మేకపాటి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments