ఉద్యోగుల ఆరోగ్య పథకం మరింత పారదర్శకంగా పటిష్టంగా అమలుకు కృషి: సిఎస్ జవహర్ రెడ్డి.

 ఉద్యోగుల ఆరోగ్య పథకం మరింత పారదర్శకంగా పటిష్టంగా అమలుకు కృషి: సిఎస్ జవహర్ రెడ్డి.విజయవాడ,12 ఆగష్టు (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పధకాన్ని(ఇహెచ్ఎస్)మరింత పారదర్శకంగా,పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో  ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ పధకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన యం.టి.కృష్ణబాబుతో సమీక్షించారు.మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి వర్యులు సమీక్షించనున్నారని సిఎస్ పేర్కొన్నారు.ఈపధకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సిఎస్ సమీక్షించారు.అంతేగాక ఈపధకాన్ని మరింత సమర్థవంతంగా,పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.


ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ఘబాబు మాట్లాడుతూ ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన వివిధ ప్రతి పాదనల అమలుకు చర్యలు తీసుకున్నామని మరికొన్ని ప్రతి పాదనలపై రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.  గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.అదే   విధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాదికి పొడిగించడం జరిగిందని సిఎస్ కు వివరించారు.అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు ఈపధకాన్ని వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు.


సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సిఎస్ కృష్ణబాబు చెప్పారు.రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు.ఇంకా ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించారు.


ఈసమావేశంలో ఆరోగ్య శ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి,వీడియో లింక్ ద్వారా ఆరోగ్యశ్రీ సిఇఓ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.Comments