రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి.

 రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి


స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సఫార్మేషన్ ఏర్పాటుకు చర్యలు

రాష్ట్రం ఉన్నత వృద్ధి రేటు సాధించేందుకు ఆర్ధికంగా,నాలెడ్జిపరంగా తోడ్పాటు

అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ పెరస్పెక్టివ్ లో విశాఖపట్నం నగరం ఎంపిక

అమరావతి,1 ఆగస్టు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి సారించింది.అందుకు రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సఫార్మేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది.నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలో గల ప్రతినిధుల బృందం మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది.ఈసమావేశంలో ప్రధానంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి వివిధ రంగాల్లో అభివృద్ధి వ్యూహాల రచన,అధిక వృద్ధి రేటు సాధనకు గల అవకాశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో చర్చించింది.అదే విధంగా అర్బనైజేషన్ మరియు ఇండస్ట్రీ పెరస్పెక్టివ్స్ లో డెవలప్పింగ్ సిటీ రీజియెన్ కాన్సెప్ట్ విధానంపై చర్చించింది.ఈసందర్భంగా నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ మాట్లాడుతూ రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధనకై అభివృద్ధి వ్యూహాల రూపకల్పనకు గాను రానున్న రెండేళ్ళలో 5 కోట్ల 28 లక్షల రూ.లు నీతి ఆయోగ్ అందించనుందని తెలిపారు.అదే విధంగా రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధనలో నీతి ఆయోగ్ ఆర్ధికపరమైన మరియు నాలెడ్జిపరమైన సహకారం అందిస్తుందని చెప్పారు.ముఖ్యంగా ఆకాంక్షాత్మక బ్లాకు(Aspirational Blocks)కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.దేశాభివృద్ధిలో నగరీకరణ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. ఉదాహరణకు దేశ భూభాగంలో నగరాలు కేవలం 3 శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉన్నా 65 శాతం జిడిపిని అందిస్తున్నాయని అదనపు కార్యదర్శి రాధ పేర్కొన్నారు.భారత దేశం రానున్న సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగే దిశగా పరుగులు తీసిస్తోందని అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని అదనపు కార్యదర్శి రాధ అన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ నగరీకరణ మరియు పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో 4నగరాలను ఎంపిక చేస్తే వాటిలో విశాఖపట్నం నగరం ఉండడం సంతోషదాయకమని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాలమైన సముద్ర తీరాన్నికలిగి ఉందని వ్యవసాయంతో పాటు ఆహాశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు పోర్టు ఆధారిత అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు తెలిపారు.అలాగే పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు పలు ప్రాజెక్టులను నెలకొల్పుతున్నట్టు తెలిపారు.విద్యా,వైద్య పరంగా పెద్దఎత్తున మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు.అదే విధంగా నవరత్నాలు పేరిట పెద్ద ఎత్తున పలు సంక్షేమ పధకాలను అమలు చేయడం వల్ల రానున్న రోజుల్లో అధికవృద్ధి రేటు సాధనకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యంగా విలేజ్ క్లినిక్లు,ప్యామిలీ డాక్టర్ విధానంతో ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దీనివల్ల మాతాశిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు,చిన్నవయస్సులోనే వివాహాలను నియంత్రించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.ఐటిఐలు,పాలిటెక్నిక్ కళాశాలలను ఒక పరిపాలనా యూనిట్ కిందకు తీసుకువచ్చి యువతలో మరింత నైపుణ్య శిక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని దీనిపై నీతి ఆయోగ్ తగిన దృష్టి సారించాలని సిఎస్ జవహర్ రెడ్డి సూచించారు.

ఈసమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాల వారీగా ఆర్ధికాభివృద్ధికి గల అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సమావేశానికి తొలుత రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమగ్రాభివృద్ధి మరియు అధికవృద్ధి రేటు సాధనకు సంబంధించి వివిధ శాఖల కార్యదర్శులతో కూర్చుని చర్చించి ఒక సమగ్ర డాక్యుమెంట్ ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు వారి శాఖలకు సంబంధించి సుస్థిరాభవృద్ధి లక్ష్యాల సాధన మరియు వృద్ధిరేటు సాధనకు తీసుకుంటున్నఅంశాలపై మాట్లాడారు.

ఇంకా ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు,వ్యవసాయ,పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, పిఆర్అండ్ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్ ప్రకాశ్, జయలక్ష్మి,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,ఐటి కార్యదర్శి కె.శశిధర్,పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్,గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే,పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్,స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమీషనర్ కె.భాస్కర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.నీతి ఆయోగ్ కన్సల్టెంట్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments