ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరాకు చర్యలు.*మచిలీపట్నం: ఆగస్టు 14, (ప్రజా అమరావతి);


*ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరాకు చర్యలు


*


*గడప గడపకు మన ప్రభుత్వం పనులు పూర్తి చేయాలి* 


*..సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్* 


జిల్లాలోని ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశమై గ్రామాలలో త్రాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 550 గ్రామాల్లోని 1,263 ఆవాసాలకు 19 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, 901 రక్షిత మంచినీటి స్కీమ్స్, 1,463 చేతిపంపుల విధానం ద్వారా గ్రామ పంచాయతీలకు మంచినీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శిస్తూ పైపులైన్ల ద్వారా నీటి కలుషితం కాకుండా పరిశీలించాలని, నిత్యం క్లోరినేషన్ జరగాలని ఆదేశించారు. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలలో గల వాటర్ టెస్టింగ్ ల్యాబ్ లలో తరచుగా మంచినీటి పరీక్షలు చేయాలని, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పనులపై పూర్తి పర్యవేక్షణ కోసం త్వరలో మొబైల్ అప్లికేషన్ ను రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.


జిల్లాలో జల జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకుగాను మొదటి దశలో రూ.159 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందుకు 618 పనులకు గాను 206 పనులు పూర్తికాగా, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. రెండవ దశలో 1,017 పనులను చేపట్టేందుకుగాను రూ.544 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఆయా పనులు టెండర్ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 డిసెంబర్ నాటికి జల జీవన్ మిషన్ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీలలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా శాశ్వత, తాత్కాలిక పద్ధతిలో నీటి సరఫరా జరగాలని అధికారులకు సూచించారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులను జాప్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.


ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ రాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


Comments