బిందు, తుంపర్ల సేద్యం పరికరాల పంపిణీ వేగం పుంజుకుంది.


నెల్లూరు, ఆగస్టు 26 (ప్రజా అమరావతి): రాష్ట్రవ్యాప్తంగా విరివిగా బిందు, తుంపర్ల సేద్యం పరికరాల పంపిణీ వేగం పుంజుకుంద


ని, రాయితీతో ఈ పరికరాలను పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నామని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శనివారం ఉదయం పొదలకూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో పొదలకూరు మండలానికి చెందిన 57 మంది రైతులకు 52.17 లక్షల విలువైన బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను 36.10 లక్షల రాయితీతో మంత్రి అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ జలకళ పథకం ద్వారా పెద్ద ఎత్తున బోర్లు మంజూరు చేస్తున్నామని, పొదలకూరు మండలంలో సుమారు 1200 బోర్లు ఇప్పటికే వేసామని, వీటికి అవసరమైన మోటార్లు, కనెక్షన్లు కూడా ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. బోర్లకు అనుసంధానంగా డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నట్లు చెప్పారు. రైతులకు సంపూర్ణంగా లబ్ధి చేకూరేలా  అన్ని చర్యలు చేపట్టామన్నారు. అవసరమైన ప్రతి రైతుకు బోర్లు వేయనున్నట్లు చెప్పారు. డ్రిప్, స్ప్రింకర్ల పరికరాల కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించాల్సిన 975 కోట్లు బకాయిలను కూడా కంపెనీలకు చెల్లించి, రైతులకు విరివిగా పరికరాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందన్నారు. అన్నదాతల ప్రయోజనాలే పరమావధిగా వారి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. 


తొలుత స్టాళ్లల్లో ఏర్పాటుచేసిన బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను మంత్రి పరిశీలించి, రైతులకు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 


ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, ఏపీఎంఐపీ పిడి శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఎంపీడీవో నగేష్ కుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments