ప్రమాణ స్వీకారం చేయించిన కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి పి. రాజాబాబు.


  మచిలీపట్నం : సెప్టెంబర్  04  (ప్రజా అమరావతి);


 *మచిలీపట్నం నగర పాలక సంస్థ రెండవ ప్రథమ మహిళ చిటికెన వెంకటేశ్వరమ్మ ఏకగ్రీవ ఎంపిక !!**ప్రమాణ స్వీకారం చేయించిన కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి పి. రాజాబాబు*
మచిలీపట్నం నగరపాలక సంస్థ రెండవ ప్రధమ మహిళగా చిటికెన వెంకటేశ్వరమ్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు


ఉదయం 8 గంటల ప్రాంతంలో మచిలీపట్నంలో భారీ ఊరేగింపు అనంతరం స్థానిక రేవతి సెంటర్ సమీపంలోని క్యాటిల్ డిపో వద్ద ఉన్న పాత మీసేవ కేంద్రంను ఇటీవల కౌన్సిల్ హాలుగా రూపొందించారు. సోమవారం అక్కడ జరిగిన మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో రెండవ మేయర్ ఎంపిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.


మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ పదవి ఎంపికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. రెండున్నర ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురైన పార్టీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్ రావు భార్య మత్స్యకార కుటుంబానికి చెందిన బీసీ మహిళ మోకా వెంకటేశ్వరమ్మను మొదటి మేయర్‌గా ఎంపిక చేసింది. రెండు సంవత్సరాల అనంతరం మేయర్ పదవి ఓసి జనరల్ కు కేటాయించాల్సినప్పటికీ, రెండవ మేయర్ గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ చిటికెన వెంకటేశ్వరమ్మ కు కేటాయించడం విశేషం.  


మచిలీపట్నం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక కార్యక్రమం జరిగింది. మేయర్ అభ్యర్థిగా 43వ డివిజన్ కార్పొరేటర్  చిటికెన వెంకటేశ్వరమ్మ పేరును పూర్వపు మేయర్ 23 వ డివిజన్ కార్పొరేటర్ మోకా వెంకటేశ్వరమ్మ ప్రతిపాదించగా, 12వ డివిజన్ కార్పొరేటర్ పూర్వపు డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత బలపరిచారు. మేయర్ గా చిటికెన వెంకటేశ్వరమ్మ ఎంపికకు సభ్యులందరూ ఆమోదం తెలపడంతో రెండవ మేయర్ గా చిటికెన వెంకటేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ ప్రకటించారు. అనంతరం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రమాణ స్వీకారం చేశారు, జిల్లా కలెక్టర్ నూతన మేయర్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని ) మాట్లాడుతూ, రెండో మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన చిటికెన వెంకటేశ్వరమ్మ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ పదవి ఒక హోదాగా అధికారం గా భావించక, ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇవ్వబడిన ఒక సదవకాశంగా భావించాలన్నారు. మేయర్ గా మంచి పాలనతో మీ పేరు మచిలీపట్నం నగరపాలక సంస్థ చరిత్రలో మంచి పరిపాలన చేసిన నాయకురాలిగా నిలిచిపోవాలని, మొదటి మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ గత పాలనతో పోటీపడి పనిచేసి ప్రజలకు ఎంతో చేరువ కావాలన్నారు. ఎవరు ఎక్కడ కనపడి ఏ సమస్య తెలియజేసినా శ్రద్ధగా ఆలకించి యుక్తిగా పరిష్కార మార్గం అన్వేషించాలన్నారు. 44 మంది కార్పొరేటర్ల పార్టీ పట్ల అంకితభావం, సహకారం కారణంగానే మేయర్ అయ్యానన్న విషయం సదా గుర్తుపెట్టుకోవాలన్నారు


పార్టీ ఆదేశమే మాకు శిరోధార్యమని భావించే సహచర కార్పొరేట్ల సహాయ సహకారాలు ఎంతో అవసరం అన్నారు. ప్రతి ఉదయం 5 గంటలకు ఏదో ఒక డివిజన్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. 


కష్టం ద్వారా మాత్రమే, స్పందించడం ద్వారా మాత్రమే, ఓపికతో ప్రజల సమస్యలు వినడం ద్వారా మాత్రమే మనసున్న మేయర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని తద్వారా మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ పీఠానికి వన్నె తీసుకురాగలిగే విధంగా మీరు ఉండాలని తాను ఆశీర్వదిస్తున్నానని మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని నూతన మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ను దీవించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ బొర్రా నాగ వెంకట దుర్గా భవాని విటల్, పూర్వపు డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, ప్రస్తుత డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ షేక్ ముస్తఫా(ఆచ్ఛాబా) వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జి. చంద్రయ్య, యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టూ),   జనసేన పార్టీ 4 వ డివిజన్ కార్పొరేటర్, వినిశెట్టి ఛాయాదేవి,పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.Comments