*డిశంబరు మాసాంతానికల్లా స్టేట్ విజన్ ప్లాన్-2047 సిద్దం*
*•వికసిత్ భారత్-2047 లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో రాష్ట్ర ప్లాన్ తయారీకి చర్యలు*
*•ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల దృక్కోణ ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు*
*•రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన 3 రోజుల వర్కుషాపు*
*•వర్కుషాపులో పాల్గొన్న సచివాలయ, విభాగాల అధిపతులతో పాటు ప్రాంతీయ, జిల్లా స్థాయి అధికారులు*
అమరావతి, అక్టోబరు 25 (ప్రజా అమరావతి): వికసిత్ భారత్-2047 లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో స్టేట్ విజన్ ప్లాన్-2047 ను ఈ డిశంబరు మాసాంతానికల్లా సిద్దం చేసేందుకు రాష్ట్ర ఉన్నత అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల వృద్ది వ్యూహంతో ఆయా శాఖల దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందజేశారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ అధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగనున్న ఈ వర్కుషాపు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా అద్యక్షతన జరిగిన తొలిరోజు వర్కుషాపులో ఆమె మాట్లాడుతూ దేశంలోని పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందజేసి, వారికి సాధికారత కల్పించడంతో పాటు ఆధునిక భారతదేశ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్-2047 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పురోగతిపైనే కాకుండా ప్రాంతీయ ఆకాంక్షలపై కూడా దృష్టి సారించిందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర విజన్ ప్లాన్ – 2047 ను రూపొందించేందుకు రాష్ట్ర అధికారులకు అవసరమైన శిక్షణను నీతి ఆయోగ్ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వర్కుషాపును రాష్ట్ర అధికారులు అంతా సద్వినియోగం చేసుకుని సమగ్రమైన స్టేట్ విజన్ ప్లాన్ – 2047 ను సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ఆమె కోరారు.
రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ వికసిత్ భారత్-2047 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక, ద్వితీయ, సామాజిక రంగాల్లో వ్యూహాత్మమైన వృద్దిని సాధించేందుకు అవసరమైన దృక్కోణ ప్ర్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక రంగానికి సంబందించి వ్యవసాయం, పశుసంవర్థకం, డైరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, కో-ఆపరేటివ్, అటవీ, జలవనరులు, భూగర్బ జలాలు, మైనర్ ఇరిగేషన్, కమాండ్ ఏరియా అభివృద్ది అంశాలపై వ్యూహాత్మమైన వృద్దిని సాధించేందుకు అవసరమైన దృక్కోణ ప్ర్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ద్వితీయ రంగానికి సంబంధించి ఇంధనం, రవాణా, ఐ.టి., టూరిజం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, హ్యడ్లూమ్ & టెక్స్ టైల్స్, గృహ నిర్మాణం, టిడ్కో తదితర అంశాలపై మరియు సామాజిక రంగం అభివృద్దిలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్యం, స్త్రీ, శిశు, వికలాంగులు, వృద్దుల సంక్షేమం మరియు పౌర సరఫరాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను, సూచనలను, సలహాలను, శిక్షణను అందజేయాలని నీతి ఆయోగ్ అధికారులను ఆయన కోరారు.
తొలి రోజు వర్కుషాపులో భాగంగా ఉదయం సామాజిక రంగానికి సంబందించి వైద్య, ఆరోగ్యం, స్త్రీ, శిశు, వికలాంగులు, వృద్దుల సంక్షేమం, పౌర సరఫరాలు అంశాలపై మరియు మధ్యాహ్నం నుండి ప్రాథమిక రంగానికి సంబంధించి వ్యవసాయం, పశుసంవర్థకం, డైరీ, ఫిషరీస్, ఉద్యానవనం, సెరికల్చర్, మార్కెటింగ్, కో-ఆపరేటివ్, అటవీ, జలవనరులు, భూగర్బ జలాలు, మైనర్ ఇరిగేషన్, కమాండ్ ఏరియా అభివృద్ది అంశాలపై సుదీర్ఝ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లకు సంబంధించి శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రంగాల వారీగా ఉన్న బలహీనతలను అధిగమించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు.
రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సి.ఇ.ఓ. హరీంధర్ ప్రసాద్, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డా.నర్శింహం, పౌర సరఫరాల శాఖ అదనపు సంచాలకులు కె.రంగకుమారి తదితరులతో పాటు నీతి ఆయోగ్ సలహాదారులు సిహెచ్. పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సెల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ & మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు డైరెక్టర్ అంకష్ వథేరా తదితరులు ఈ వర్కుషాపులో పాల్గొన్నారు.
addComments
Post a Comment