ఉత్కంఠ పోరులో కంగారూలదే విజయం.. పోరాడి ఓడిన కివీస్.

 *ఉత్కంఠ పోరులో కంగారూలదే విజయం.. పోరాడి ఓడిన కివీస్*











ధర్మశాల  :అక్టోబర్ 28 (ప్రజా అమరావతి);

పాకిస్తాన్‌ –దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం ముగిసిన థ్రిల్లర్‌ను మరిచిపోకముందే శనివారం మరో రెండు అగ్రశ్రేణి జట్లు  క్రికెట్‌ ఫ్యాన్స్‌కు  హై స్కోరింగ్ థ్రిల్లర్‌  మజాను అందించాయి. బంతిని బాదుడే లక్ష్యంగా   క్రీజులోకి వచ్చిన ఇరు జట్ల బ్యాటర్లు  ధర్మశాలలో పరుగుల వరద పారించారు. 


ఆస్ట్రేలియా నిర్దేశించిన  389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ కూడా దంచికొట్టింది. భారీ ఛేదనలో రచిన్‌ రవీంద్ర (89 బంతుల్లో  116, 9 ఫో్ర్లు, 5 సిక్సర్లు) పోరాటానికి తోడు డారెల్‌ మిచెల్‌ (51 బంతుల్లో 54, 6 ఫోర్లు, 1 సిక్సర్‌), జేమ్స్‌ నీషమ్‌ (39 బంతుల్లో 58, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) లు  రాణించడంతో  కివీస్‌ నిర్ణీత 50  ఓవర్లలో 383 పరుగులకే పరిమితమై ఐదు పరుగుల తేడాతో ఓడింది.


*ఈ టోర్నీలో కివీస్‌కు ఇది రెండో ఓటమి కాగా ఆసీస్‌కు నాలుగో విజయం*



ప్రపంచ నెంబర్‌ వన్‌ పేస్‌ త్రయం   మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హెజిల్‌వుడ్‌,  పాట్‌ కమిన్స్‌ వంటి  బౌలర్లను  సమర్థంగా ఎదుర్కున్న  రవీంద్ర..  కివీస్‌లో గెలుపు ఆశలు నింపాడు. వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ కు వచ్చిన రచిన్‌..   49 బంతుల్లోనే అర్థ సెంచరీ చేయగా  77 బంతుల్లోనే  సెంచరీ పూర్తిచేశాడు. 


రచిన్‌కు  ఈ వరల్డ్‌ కప్‌లో ఇది రెండో శతకం కావడం గమనార్హం. ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండు శతకాలు, రెండు అర్థ శతకాలు సాధించాడు.


భారీ ఛేదనలో  కివీస్‌కు శుభారంభమే దక్కింది.   ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (17 బంతుల్లో 28, 6 ఫోర్లు), విల్‌ యంగ్‌ (37 బంతుల్లో 32, 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఉన్నంతసేపు   స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.  ఈ ఇద్దరినీ హెజిల్‌వుడ్‌ పెవిలియన్‌కు పంపాడు.   ఈ క్రమంలో  క్రీజులోకి వచ్చిన   రచిన్‌.. డారెల్‌ మిచెల్‌  తో కలిసి  మూడో వికెట్‌కు  86 బంతుల్లోనే 96 పరుగులు జోడించాడు. 


అయితే జంపా ఎంట్రీ  తర్వాత  కివీస్‌ తడబడింది.   జంపా వేసిన  24వ ఓవర్లో  మిచెల్‌.. స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (21) కూడా  జంపా చేతికే చిక్కాడు.  కివీస్‌ భారీ ఆశలు పెట్టుకున్న  గ్లెన్‌ ఫిలిప్స్‌ (12) దారుణంగా నిరాశపరిచాడు. ఫిలిప్స్‌ను మ్యాక్స్‌వెల్‌  బోల్తా కొట్టించాడు.


వరుసగా వికెట్లు కోల్పోతున్నా   ధాటిగా ఆడిన   రచిన్‌..  ఆసీస్‌  బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నాడు.అయితే  ఛేదించాల్సిన  రన్‌ రేట్‌ పెరిగిపోతుండటంతో హిట్టింగ్‌ కు దిగిన రచిన్‌.. కమిన్స్‌ వేసిన  40వ  ఓవర్లో  రెండో బంతికి  భారీ షాట్‌ ఆడబోయి  బౌండరీ లైన్‌ వద్ద  లబూషేన్‌ చేతికి చిక్కాడు.  


రచిన్‌ నిష్క్రమించాక వచ్చిన మిచెల్‌ శాంట్నర్‌  (12 బంతుల్లో 17,  1 ఫోర్‌, 1 సిక్స్‌) ధాటిగా ఆడేందుకు యత్నించినా  అతడిని జంపా  ఔట్‌ చేశాడు.


చివర్లో  జేమ్స్‌ నీషమ్‌  శివాలెత్తాడు. ఫిలిప్స్‌ నిష్క్రమణ తర్వాత వచ్చిన నీషమ్‌.. ఆది నుంచే ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. స్టార్క్‌ వేసిన  46వ ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన అతడు.. అతడే వేసిన  48వ ఓవర్లో మరో సిక్సర్‌ కొట్టి కివీస్‌ స్కోరును 350 దాటించాడు.


ఆఖరి రెండు ఓవర్లలో  32 పరుగులు చేయాల్సి ఉండగా.. హెజిల్‌వుడ్‌ వేసిన 49వ ఓవర్లో ట్రెంట్‌ బౌల్డ్‌ (8 బంతుల్లో 10 నాటౌట్‌)  సిక్సర్‌ బాదగా  నాలుగో బంతికి నీషమ్‌  బౌండరీ కొట్టి  35 బంతుల్లోనే అర్థ  సెంచరీ పూర్తి చేశాడు.


*చివరి ఓవర్‌ సాగిందిలా*


ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికి  బౌల్ట్‌ సింగిల్‌ తీశాడు. రెండో బంతికి  వైడ్‌తో పాటు  నాలుగు పరుగులొచ్చాయి.  మూడు, నాలుగో బంతులకు  డబుల్స్‌ తీశాడు. 


ఐదో బంతికి ఒక పరుగు పూర్తిచేసి రెండో పరుగు చేయబోగా నీషమ్‌ రనౌట్‌ అవడంతో కివీస్‌  గుండె పగిలింది. ఆఖరి బంతికి పరుగులేమీ రాలేదు.  దీంతో ఆసీస్‌ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది..

Comments