ఇసుక ఆపరేషన్స్ లో ప్రభుత్వం ఎటువంటి వ్యయం చేయడం లేదు.



- ప్రభుత్వం రూ.100 కోట్ల పైబడి ఖర్చు చేసే ప్రాజెక్ట్ లకే జ్యుడీషియల్ ప్రివ్యూ

- జ్యుడీషియల్ ప్రివ్యూ నిబంధనల్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉంది

- ఇసుక ఆపరేషన్స్ లో ప్రభుత్వం ఎటువంటి వ్యయం చేయడం లేదు

- కేంద్రప్రభుత్వరంగ సంస్థ ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాం

- టెండర్ దక్కించుకున్న లీజుదారు ఇసుక తవ్వకం, విక్రయాలు చేస్తారు

- అందుకు గానూ నిర్ధేశించిన మొత్తాన్ని ప్రభుత్వానికే చెల్లిస్తారు

- ఈ విషయంలో అవగాహన లేకుండా 'ఈనాడు' తప్పుడు రాతలు

- బీచ్ శాండ్ టెండర్లలో లీజుదారుడికి నిర్వహణా వ్యయంను ఎపిఎండిసి చెల్లిస్తుంది

- ఇక్కడ ప్రభుత్వరంగ సంస్థగా ఎపిఎండిసి రూ.100 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది

- అందుకే బీచ్ శాండ్ టెండర్లు జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాం

- ప్రభుత్వంపై బురదచల్లేందుకే 'ఈనాడు' వక్రీకరణ రాతలు


: గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి

అమరావతి (ప్రజా అమరావతి):

 1) ఇసుక టెండర్లపై న్యాయ సమీక్ష ఏదీ? శీర్షికన ఈనాడు దినపత్రిక రాసిన కథనం పూర్తిగా అవగాహనారాహిత్యంతో కూడుకున్నదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ నిబంధనలపై కనీస అవగాహన కూడా లేకుండా, కేవలం ప్రభుత్వంపై బురదచల్లాలనే లక్ష్యంతోనే 'ఈనాడు' పత్రిక ఈ వక్రీకరణ వార్తను ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ ప్రివ్యూ కు సంబంధించిన నిబంధనలు ఆన్ లైన్ లో అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉన్నాయని, కనీసం వాటిని పరిశీలించాలనే ఆలోచన కూడా 'ఈనాడు' పత్రిక చేయకపోవడం బాధ్యాతారాహిత్యమేనని అన్నారు. 

2) ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ కోసం రూ.100 కోట్లకు పైగా వ్యయం చేసే క్రమంలో సదరు ప్రాజెక్ట్ కు నిర్వహించే టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఆమోదం తీసుకోవాలని చట్టంలో ఉందని తెలిపారు.  తాజాగా గనులశాఖ కేంద్రప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం  టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు టెండర్ల ప్రక్రియకు జ్యుడీషియల్ ప్రివ్యూ  ఎందుకు కోరలేదంటూ 'ఈనాడు' పత్రిక తన కథనంలో ప్రశ్నించిందని అన్నారు. ఇలా చేయకపోవడం సందేహాలకు తావిస్తోందంటూ తన కథనంలో ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. 

3) జ్యుడీషియల్ ప్రిఫ్యూ కోసం రూపొందించిన చట్టంలో ఉన్న అంశాలను కనీసం పరిశీలించకుండానే ఈనాడు పత్రిక ఊహాగానాలతో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం కాంట్రాక్టింగ్ ఏజెన్సీని టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేసే  వ్యయం చాలా స్వల్పమని తెలిపారు. ఈ టెండర్లలో ఎంపికైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. సదరు సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తానికి ఇసుకను వినియోగదారులకు విక్రయించి, టెండర్లలో ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తానని కోట్ చేసిందో సదరు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుందని వివరించారు.  ఈ ప్రక్రియలో ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఎక్కడ వ్యయం చేస్తోందని ప్రశ్నించారు? అలాంటప్పుడు న్యాయసమీక్షకు పంపలేదని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. 

4) బీచ్ శాండ్ టెండర్లను న్యాయ సమీక్షకు పంపారు, ఇసుక టెండర్లను పంపలేదని ఈనాడు పత్రిక బోడిగుండుకు, మోకాలికి ముడి వేసేలా తన కథనంలో వాదించడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీచ్ శాండ్ ఆపరేషన్స్ చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఎపిఎండిసి చెల్లింపులు చేస్తోంది. ఇందుకు గానూ రూ.100 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండటం వల్లే సదరు టెండర్లను న్యాయసమీక్షకు పంపామని తెలిపారు. ఇసుక ఆపరేషన్స్ విషయంలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వెల్లడించారు. దీనిని అర్థం చేసుకోకుండా సందేహాలు అంటూ ఈనాడు పత్రిక అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు.

Comments