అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ.- ఇసుక టెండర్ల ప్రక్రియపై టిడిపి నేతల ఆరోపణలు అర్థరహితం

- అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ


- కేంద్రప్రభుత్వ సంస్థ ఎంఎస్ టిసి ఆధ్వర్యంలో టెండర్లు

- జిల్లాల పునర్విభజన వల్లే ప్యాకేజీ రిజర్వ్ ప్రైస్ లో మార్పులు

- రిజర్వ్ ప్రైస్ తగ్గించారన్న తెలుగుదేశం నేతల ఆరోపణలు అర్థరహితం

- 2021లో మూడు ప్యాకేజీలకు నిర్ణయించిన రిజర్వు ప్రైస్: రూ.1510 కోట్లు

- తాజా టెండర్లలో నిర్ణయించిన రిజర్వు ప్రైస్ : రూ.1529 కోట్లు

- ప్యాకేజీ-2లో తగ్గిన రూ.55 కోట్లు ప్యాకేజీ-1 రిజర్వు ప్రైస్ లో కలిశాయి

- 2021లో పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ : రూ.120 కోట్లు

- తాజా టెండర్లలో నిర్ణయించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ : రూ.153 కోట్లు

- అంటే గతం కంటే రూ.33 కోట్లు ఎక్కువ ప్రభుత్వానికి వస్తుంది

- స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు అనేది సక్సెస్ ఫుల్ బిడ్డర్ అంతర్గత వ్యవహారం

- సక్సెస్ ఫుల్ బిడ్డర్ మాత్రమే ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు

- దీనిని అర్థం చేసుకోకుండా దీపావళి డిస్కాంట్ పేరుతో అవగాహన లేని విమర్శలు

- ఆన్ లైన్ లో ఇసుక టెండర్ల వివరాలు ఉన్నాయి

- వాటి ద్వారా ఎవరైనా సరే వివరాలను తెలుసుకోవచ్చు

- ఉచిత ఇసుక విధానం ద్వారా ఇసుక మాఫియా కోట్లు కొల్లగొట్టింది

- ఈ ప్రభుత్వంలో దానికి అవకాశం లేకపోవడంతోనే ఇటువంటి అసత్య ఆరోపణలు

- రాజకీయంగా ఇసుక టెండర్లపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు


: శ్రీ విజి వెంకటరెడ్డి, రాష్ట్ర గనులశాఖ సంచాలకులు


అమరావతి (ప్రజా అమరావతి);:


1) రాష్ట్రంలో ఇసుక టెండర్ల ప్రక్రియపై తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. టెండర్ల ప్రక్రయపై రాజకీయ దురుద్దేశంతోనే కావాలని బుదరచల్లుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కారణంగా ప్యాకేజీ రిజర్వు ప్రైస్ ల్లో మార్పులు చేశామని, దీనిపై కనీస అవగాహన కూడా లేకుండా తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.


2) రాష్ట్రంలో మూడు ప్యాకేజీలకు గానూ ఈ నెల 7వ తేదీన క్యుములేటీవ్ రిజర్వ్ ప్రైస్ కింద రూ.1529 కోట్లు గా క్యుములేటీవ్ రిజర్వ్ ప్రైస్ నిర్ణయిస్తూ టెండర్లు పిలవడం జరిగింది. తాజగా ప్యాకేజీ-2 కి గానూ నిర్ణయించిన రిజర్వు ప్రైస్, 2021 న నిర్ణయించిన దానికన్నా తక్కువగా ఉండటంపై ప్రతిపక్ష నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 


- వాస్తవానికి ప్యాకేజీ-1కు 2021లో రూ.470 కోట్లుగా రిజర్వు ప్రైస్ ఖరారు చేయగా, తాజాగా రూ.533 కోట్లుగా ఖరారు చేయడం జరిగింది. 

- అలాగే ప్యాకేజీ-2కు 2021లో రూ.740 కోట్లుగా రిజర్వు ప్రైస్ ఖరారు చేయగా, తాజాగా రూ.691 కోట్లుగా ఖరారు చేయడం జరిగింది.

- అలాగే ప్యాకేజీ-3 కు 2021లో రూ.300 కోట్లుగా రిజర్వు ప్రైస్ ఖరారు చేయగా, తాజాగా రూ.306 కోట్లుగా ఖరారు చేయడం జరిగింది.


3) అంటే 2021లో మూడు ప్యాకేజీలకు ఖరారు చేసి రిజర్వు ప్రైస్ రూ.1510 కోట్లు కాగా, తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన టెండర్లలో రూ.1529 కోట్లు రిజర్వు ప్రైస్ గా ఖరారు చేయడం జరిగింది. దీనిపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు ఇసుక టెండర్లలో అక్రమాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు కూడా కనీసం వాస్తవాలను పరిశీలించకుండానే ప్రభుత్వంపై బురదచల్లాలనే లక్ష్యంతోనే ఇటువంటి అసత్యాలతో కూడిన ఆరోపణలు చేయడం బాధాకరం. 


4) జిల్లాల పునర్విభజన కారణంగా గతంలో ప్యాకేజీ-2 కింద పశ్చిమగోదావరిజిల్లా పరిధిలో ఉన్న 20 ఇసుక రీచ్ లు ఇప్పుడు ప్యాకేజీ-1 కింద తూర్పు గోదావరిజిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈ రీచ్ ల్లో పర్యావరణ అనుమతుల మేరకు, దాదాపు రూ.55 కోట్ల విలువైన 14.60 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ప్యాకేజీ-1 పరిధిలోకి వచ్చాయి. దాని ప్రకారం ప్యాకేజీ-1 లో అదనంగా రూ.55 కోట్లు రిజర్వు ప్రైస్ లో కలిసింది. అదే క్రమంలో ప్యాకేజీ-2 నుంచి ఇదే మొత్తం తగ్గింది. దీనిని అర్థం చేసుకోకుండా దీపావళి-దసరా డిస్కంట్లుగా రిజర్వు ప్రైస్ ను తగ్గించేశారంటూ ప్రతిపక్ష నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం. 

 

5) ఇసుక టెండర్లకు ఖరారు చేసిన బిడ్ సెక్యూరిటీ, పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీపై కూడా ప్రతిపక్ష నేతలు అవగాహన లేని ఆరోపణలు చేశారు. 2021లో నిర్వహించిన టెండర్లలో బిడ్ సెక్యూరిటీ మొత్తాన్ని రూ.120 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. అలాగే పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ మొత్తాన్ని రూ.120 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. టెండర్లు దాఖలు చేసే ప్రతి బిడ్డరు బిడ్ సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. టెండర్లలో సక్సెస్ ఫుల్ బిడ్డర్ మాత్రమే పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తారు. టెండర్లలో పాల్గొని, బిడ్ దక్కని వారికి, వారు చెల్లించిన బిడ్ సెక్యురిటీ మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది. 


6) అయితే ఎక్కువ మంది ఇసుక టెండర్లలో పాల్గొనేందుకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు గతంలో నిర్ణయించిన బిడ్ సెక్యూరిటీ రూ.120 కోట్ల ను తాజా టెండర్లలో రూ.77 కోట్లకు తగ్గించడం జరిగింది. దీనివల్ల ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వస్తారు. అదే క్రమంలో సక్సెస్ ఫుల్ బిడ్డర్ నుంచి పెర్ఫార్మెన్ సెక్యూరిటీని కూడా గతం కంటే ఎక్కువగా అంటే రూ.153 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి 2021లో పెర్ఫార్మెన్ సెక్యూరిటీగా చెల్లించింది రూ.120 కోట్లు అయితే, తాజాగా నిర్వహిస్తున్న టెండర్ల ద్వారా ప్రభుత్వం వద్ద ఉండే డిపాజిట్ గ్యారెంటీ రూ.153 కోట్లు. అంటే ప్రభుత్వానికి గతం కంటే రూ.33 కోట్లు పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ మొత్తం అధికంగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఇది కాంట్రాక్టర్ కు మేలు చేసేలా ఉందని, ఇది కూడా అక్రమమేనని తెలుగుదేశం నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.


7) బిడ్ దాఖలు చేసే తేదీని అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6వ తేదీకి పెంచడంపైన కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రీబిడ్ సమావేశం అక్టోబర్ 17వ తేదీన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వివిధ సందేహాలను లెవనేత్తారు. వాటికి సహేతుకమైన సమాధానాలను దసరా సెలవుల కారణంగా 26వ తేదీన వాటిని నోటిఫై చేయడం జరిగింది. వాటిని బిడ్డర్లు అధ్యయనం చేయడానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉండటం, గడువును పొడిగిస్తే ఎక్కువ మంది బిడ్ దాఖలు చేసేందుకు అవకాశం ఉండటంతో గడువును పొడిగించడం జరిగింది. 


8) ప్రీ-బిడ్ సమావేశంలో ఇసుక ఆపరేషన్స్ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పివి) ఏర్పాటుకు వీలు కల్పించాలని పలువురు బిడ్డర్లు అభ్యర్థించారు. ఎస్పివి ద్వారా మొత్తం ఆపరేషన్స్ చేపడతామని విజ్ఞప్తి చేశారు. అయితే సెలెక్టెడ్ బిడ్డర్ మాత్రమే ప్రభుత్వానికి బాధ్యత వహించాలని, వారు ఏర్పాటు చేసుకునే ఎస్పీవి నిర్వహించే కార్యకలాపాలకు కూడా సెలెక్టర్ బిడ్డరే బాధ్యుడు అవుతారని స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సెలెక్టెడ్ బిడ్డర్ ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీ ద్వారా ప్రభుత్వం తనకు రావాల్సిన మొత్తాన్ని రికవరీ చేసుకుంటుంది. దీనిపైన కూడా అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదు.  

 


9) గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్లాధి రూపాయల రెవెన్యూ ప్రభుత్వంకు రాకుండా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. ఈ దోపిడీని నివారించేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అత్యంత పారదర్శకంగా నూతన ఇసుక విధానంను రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ విధానం కారణంగా ఏటా రూ.765 కోట్ల మేర రెవెన్యూ ప్రభుత్వానికి వస్తోంది. తిరిగి ఈ సొమ్ము ప్రజాసంక్షేమానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గతంలో ఈ మొత్తం సొమ్మును దిగమించిన ఇసుక మాఫియాకు ఈ వ్యవహారం మింగుడు పడక ఇసుక టెండర్లపై పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

Comments