జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి.



*జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి*



*-- కలెక్టర్ పి. రాజాబాబు*



మచిలీపట్నం : 28, అక్టోబర్ (ప్రజా అమరావతి);



రామాయణాన్ని మహా అద్భుత కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి,మహర్షి వాల్మీకి అని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కీర్తించారు. 


శనివారం కృష్ణాజిల్లా కలెక్టర్ ఛాంబర్ ఎదుట వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.తొలుత జిల్లా కలెక్టర్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, పుణ్య భూమి, కర్మ భూమి మన భారత దేశమని రామాయణం మన పూజ్య గ్రంథమని అలాంటి గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి పూజ్యనీయులన్నారు.  ఆయన ఆది కవి వాల్మీకిని స్మరించుకుని,ఆ దివ్య పురుషునికి నీరాజనాలు పలికారు. ఒకే మాట… ఒకే బాణం.. ఒకే భార్య.. అనే రాముడి లక్షణాలు చాలా సులువుగా ప్రజలకు అర్థమయ్యేలా తన రచనలతో అందరికీ చేరవేసిన వాల్మీకి మహర్షి గొప్ప శక్తి అని, అందుకే ఒక బోయవాడు కాస్త మహర్షిగా కీర్తించబడ్డారన్నారు.  రామా అని పలకడం సైతం రాని వ్యక్తి సమాజానికి సత్యం, ధర్మనిష్ఠ నేర్పి మహర్షి అయ్యారని అన్నారు. వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శనీయమని, వారి అడుగు జాడల్లో నడవాలన్నారు. తాను గురిచూసి వదిలిన బాణం తగిలి రెండు పక్షులలో ఒకటి మరణించిన సందర్భంలో శోకం నుండి మొట్ట మొదటి శ్లోకం మనకు అందించిన మహర్షి వాల్మీకి అని కలెక్టర్ కొనియాడారు. వాల్మీకి మహర్షి రామాయణంలో దాదాపు ఇరభై నాలుగు వేల శ్లోకాలు రాశారని, తన చుట్టూ పుట్ట పెరిగినా తన దీక్షను, తపస్సును విడువకుండా పూర్తి చేసిన మహానుభావుడు అందుకే వారు వాల్మీకి మహర్షి అయ్యారని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా  ఆచరిస్తుందని, ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జ్ఞానం అనేది ఎవరో ఒకరి సొత్తు కాదని, కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమేనని, అది బోయ సామాజిక వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో కచ్చితంగా నిరూపితమైందని కలెక్టర్ అన్నారు. వాల్మీకి మహర్షి జీవితం విశ్వ మానవాళికి ఆదర్శనీయమని,వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు జిల్లా వాసులందరికీ తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఈ సందర్భంగా కొనియాడారు. 


ఈ కార్యక్రమంలో  జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ,సాధికార అధికారి ఏ. శ్రీనివాసరావు , బీసీ కార్పొరేషన్ ఏఈఓ కె. రాజేంద్ర బాబు, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిరా, పలువురు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, బీసీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.



Comments