తుది దశకు చేరిన బేతంచెర్ల అభివృద్ధి పనులు.*తుది దశకు చేరిన బేతంచెర్ల  అభివృద్ధి పనులు**బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, ఎమ్ఎస్ఎమ్ఈ, ఐటీఐ కాలేజీ పనుల పరిశీలన*


*డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని గడువు నిర్దేశించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా, అక్టోబర్, 19 (ప్రజా అమరావతి); బేతంచెర్లలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరాయి. బేతంచెర్లను విద్యాహబ్ గా మార్చాలనుకున్న మంత్రి బుగ్గన సంకల్పం మరికొన్ని రోజుల్లో నెరవేరేలా  నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గురువారం ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు పర్యటన ముగిశాక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్ల పట్టణంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు.  దాదాపు 110 గదులతో నిర్మిస్తోన్న బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని తొలుత పరిశీలించారు. రూ.36 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణంలో ఇప్పటికే డైనింగ్ బ్లాక్, రూఫ్ స్లాబ్, ప్లాస్టెరింగ్, హాస్టల్ బ్లాక్-2 సహా కీలక పనులు పూర్తయినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. మిగతా పనులు కూడా  మరింత త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి బుగ్గన ఆదేశించారు.  ఐటీఐ డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారికి, వివిధ వృత్తి పనుల వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇచ్చే ఎమ్ఎస్ఎమ్ఈ సెంటర్ ను కూడా మంత్రి పరిశీలించారు. రూ.4 కోట్లతో నిర్మిస్తోన్న ఈ  భవనంలో ఇప్పటికే అడ్మిన్ బ్లాక్, వర్క్ షాప్ , స్లాబ్ పనులు సహా సింహభాగం పనులు పూర్తయినట్లు మంత్రి వివరించారు. రూ.7.8 కోట్లతో నిర్మిస్తోన్న ఐటీఐ కాలేజీ పనులు చురుకుగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పనులన్నీ డిసెంబర్ నెల కల్లా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు.ఈ కాలేజీలో అత్యాధునిక సదుపాయాలైన యంత్రాలు, పరికరాలు, సామాగ్రీ కోసం మరో రూ.3 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం బేతంచెర్ల పట్టణంలో రూ.80 లక్షలతో కొత్తగా నిర్మిస్తోన్న ఆర్ అండ్ బీ ఇన్స్ పెక్షన్ బంగ్లా పనులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు.Comments