*సంక్రాంతికి బేతంచెర్లకు స్వచ్ఛమైన త్రాగునీరు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
*క్రిస్మస్ నాటికి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి బుగ్గానిపల్లె నీటి శుద్ధి కేంద్రానికి నీటి సరఫరా*
*ఫిబ్రవరి ఆఖరికి డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా పుష్కలంగా తాగునీరు*
*యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసే దిశగా ప్రణాళిక, కార్యాచరణకు మంత్రి బుగ్గన చొరవ*
*ఆర్థిక మంత్రి బుగ్గనతో 'మేఘా' నిర్మాణ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి కీలక సమావేశం
*
*గోరుకల్లు రిజర్వాయర్ వద్ద పంపింగ్ స్టేషన్, బేతంచెర్లలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ సందర్శన*
బేతంచెర్ల, నంద్యాల జిల్లా, నవంబర్, 20 (ప్రజా అమరావతి); సంక్రాంతి పండగ కల్లా బేతంచెర్లకు స్వచ్ఛమైన తాగునీరివ్వడమే లక్ష్యంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల పూర్తికి కృషి చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. క్రిస్మస్ నాటికల్లా పాణ్యంలోని గోరుకల్లు రిజర్వాయర్ నుంచి బేతంచెర్లలోని బుగ్గానిపల్లె తాండలో నిర్మిస్తోన్న నీటి శుద్ధి కేంద్రానికి నీరు తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాలన్నింటికీ తాగునీరిస్తామన్నారు. అందులో భాగంగా సోమవారం బేతంచెర్లలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో 'మేఘా' నిర్మాణ సంస్థ ఎండీ పీ.వి కృష్ణారెడ్డి కీలకంగా సమావేశమయ్యారు. గోరుకల్లు రిజర్వాయర్, బుగ్గానిపల్లె తాండలోని వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లను సందర్శించిన అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన బేతంచెర్లలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గోరుకల్లు రిజర్వాయర్ వద్ద నిర్మించే పంపింగ్ స్టేషన్ పనులు నాణ్యతగా చేయాలని మంత్రి బుగ్గన అధికారులను ఆదేశించారు. పైపులు, మ్యాన్ పవర్ కొరతపై దృష్టిసారించి మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు కావలసిన అటవీ, జాతీయ రహదారుల అనుమతులు సహా సవరించిన అంచనా మొత్తానికి ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ప్రాజెక్టును త్వరిగతిన పూర్తి చేయడం కోసం మరో 600 మందిని వారంలోగా ప్రాజెక్టు మేనేజర్లు, ఇన్ ఛార్జ్ లు, కో ఆర్డినేటర్లు, కార్మికులను నియమిస్తామని మేఘా ఎండీ కృష్ణారెడ్డి మంత్రి బుగ్గనకు వివరించారు. 6 క్లస్టర్లను పూర్తి చేసేందుకు 20 బృందాలను నియమించుకుని రెండు షిఫ్టులుగా పని చేసేలా చర్యలు చేపడతామన్నారు. మూడవ క్లస్టర్ పనులు పూర్తి చేసేందుకు సాంకేతికంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశమున్న నేపథ్యంలో సమాంతరంగా మిగతా పనులపై దృష్టిసారిస్తామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 పంప్ హౌస్ లు, రైల్వే క్రాసింగ్ లు, ఇటుక, విద్యుత్ పనులకు కావలసిన సమగ్ర వనరులను వారంలోగా అందుబాటులోకి తీసుకువస్తామని మేఘా బృందానికి ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బలపాలపల్లె, బుగ్గానిపల్లె,ముగ్ధవరం ప్రాంతాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సుగాలి మెట్ట దగ్గర వాటర్ పైప్ లైన్ కు అవసరమైన రక్షణ ఏర్పాట్లు చూడాలన్నారు. పైప్ ల కొరతను అధిగమించేలా అవసరమైతే విజయవాడ నుంచి పైపులను తీసుకువస్తామని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ జిలానీ సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, మేఘా నిర్మాణ సంస్థ ఎండీ పీ.వీ కృష్ణారెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment