సోనియాతో ఆసక్తికర సంభాషణ.. మధిర సభలో ప్రియాంక కీలక వ్యాఖ్యలు..

 *సోనియాతో ఆసక్తికర సంభాషణ.. మధిర సభలో ప్రియాంక కీలక వ్యాఖ్యలు..


*

మధిర  (ప్రజా అమరావతి);

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మధిరలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. గతంలో బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే తెలంగాణ ఆకాంక్ష నెరవేరేది. తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చే ప్రభుత్వం తమదే అన్నారు ప్రియాంక గాంధీ. భట్టి విక్రమార్క పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నా అన్నారు. సంపదను పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు నిమఘ్నమయ్యారంటూ విమర్శించారు. తాము సంపదను ప్రజలకు పంచి పెడతామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. నిన్న రాత్రి సోనియా గాంధీ తనకు ఫోన్ చేసి.. తెలంగాణకు వెళ్లావు ఏం సందేశం ఇస్తావని అడిగినట్లు చెప్పారు. అప్పుడు ప్రియాంక బదులిస్తూ సత్యం మాత్రమే చెబుతానని తన తల్లితో అన్నట్లు ప్రజలతో పంచుకున్నారు. అప్పుడు సోనియా స్పందిస్తూ హామీలు ఇవ్వడం కాదు.. దానిని అమలు చేసేందుకు కృషి చేయాలని తనతో చెప్పిన సంభాషణను సభకు వచ్చిన ప్రజలతో పంచుకున్నారు


బీఆర్ఎస్ సర్కార్ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో ప్రజలే నాయకులు అంటూ కీర్తించారు.  కాంగ్రెస్ గ్యారెంటీల్లో చెప్పిన హామీలన్నీ అమలు చేసి తీరతాం అన్నారు. పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్య,  ఏ పని చేయాలన్నా లంచాలు, అవినీతితో ప్రజలు విసిగిపోయారన్నారు. అలాగే తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. రుణమాఫీ చేస్తామని రైతులను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరను ఇవ్వడంలో విఫలమైందన్నారు. పేపర్ల లీకులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ బిడ్డ భవిష్యత్తు ఏంటా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.  తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్లతో పాటూ  ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న సర్కార్‌ కొలువులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు.  తెలంగాణ యువత బాధలు కేసీఆర్‌కి పట్టవు అంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డు కింద రూ.10లక్షలు వైద్య సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Comments