పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్స్ కొరత సమస్య పరిష్కరించాలి.

 

పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్స్ కొరత సమస్య పరిష్కరించాలి



జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుటకు 22 కోట్లు మంజూరు

మచిలీపట్నం, నవంబర్ 14 (ప్రజా అమరావతి);

పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్స్ కొరత కారణంగా పదవ తరగతి విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, సమస్య పరిష్కరించాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు కోరారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాలు చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగింది.

తొలుత సమావేశాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుటకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న ట్లు తెలిపారు. ఇందుకు జడ్పీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు జడ్పీ మంజూరు చేసిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని,  ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.

తొలుత సమావేశంలో విద్యా శాఖ అంశాలపై సమీక్షించారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలనే నిబంధనలు సరిగా అమలు కావడంలేదని పలువురు సభ్యులు లేవనెత్తారు. 

ఈ అంశంపై జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కేవలం 9 శాతం సీట్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తల్లిదండ్రులకు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సరైన అవగాహన కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలన్నారు.

గత ఏడాది మాదిరిగానే పదవ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది కూడా అదనపు తరగతుల నిర్వహణ సందర్భంలో జిల్లా పరిషత్ ద్వారా అల్పాహారం అందించాలని సభ్యులు కోరారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ గత ఏడాది పదవ తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ స్టడీ మెటీరియల్ అందజేసిందని, తద్వారా ఉత్తీర్నతా శాతం పెరిగిందని అన్నారు. ఈ ఏడాది కూడా ఉమ్మడి కృష్ణ పరిధిలోని 35,000 మంది పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ త్వరలో అందజేస్తామన్నారు. అదేవిధంగా పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధనకై అదనపు తరగతులు నిర్వహించే సమయంలో పదవ తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ ద్వారా అల్పాహారం అందిస్తామన్నారు.

కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది టీచర్ల బదిలీలు జరిగినప్పుడు చాలామంది టీచర్లు పట్టణాలకు వెళ్లారని అవి తిరిగి భర్తీ కానందున కైకలూరు నియోజకవర్గం పరిధిలో కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో పదవ తరగతి బోధించే సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, సమస్య తీవ్రంగా ఉందని,  పరిష్కరించాలన్నారు. కైకలూరు కలిదిండి జడ్పీటీసీలు కూడా ఇదే సమస్య సమావేశంలో లేవనెత్తారు.

బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు జిల్లాల కలెక్టర్లు సమావేశమై సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ డైరీ, కేడీసీసీ బ్యాంకు వంటి ప్రభుత్వ రంగ సంస్థల సిఎస్ఆర్ నిధులు సేకరించి, విద్యా వాలంటీర్లను సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు

కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ సమీప పాఠశాలల నుండి మిగులు టీచర్లను సర్దుబాటు చేయడం జరిగిందని, అయినప్పటికీ సమస్య తీవ్రత దృష్ట్యా ఎన్టీఆర్, ఏలూరు కలెక్టర్లతో మాట్లాడి మీటింగ్ పెట్టుకుని, ఈ సమస్యపై చర్చించి, సమస్య పరిష్కారానికి వ్యక్తిగత శ్రద్ధ వహిస్తామన్నారు.

కృత్తివెన్ను మండలం సీతనపల్లి, లక్ష్మీపురం కోమాళ్ళపూడి గ్రామాల హరిజనవాడలలో పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లలో నడుస్తున్నాయని, సొంత భవనాలు మంజూరు చేయాలని జడ్పిటిసి మైలా రత్నకుమారి కోరారు.

తాడంకి జడ్పీ హైస్కూల్ ప్రక్కన పోరంబోకు స్థలాలు ఆక్రమాలకు గురయ్యాయని బ్రాందీ షాపు బెల్ట్ షాపులు నడుస్తూ విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని సమస్య పరిష్కరించాలని పమిడి ముక్కల జడ్పిటిసి కోరగా, ఎక్సైజ్, పోలీసు అధికారులు సమావేశం పెట్టి సమస్య పరిష్కరించాలని పేర్ని నాని అధికారులకు సూచించారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యులు అడిగే ప్రశ్నలు ముందుగా చైర్పర్సన్ గారి ద్వారా ముందుగా అధికారులకు పంపితే సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి సమాధానాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధపడతారని, లిఖితపూర్వక సమాధానాలు అందుతాయని అన్నారు. ఈ సందర్భంగా బందరు ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ వచ్చే సమావేశం నుండి ఈ విధానం అమలు చేయాలని సూచించారు.

ఏలూరులో సాగునీటి సలహా మండలి సమావేశం ఉన్నందున ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ సూపర్నెంట్ ఇంజనీర్లు జడ్పీ సమావేశానికి రాలేదని, ఈ కారణంగా  సప్లిమెంటరీ సమావేశం వారంలోగా ఏర్పాటు చేసి సమీక్షిస్తామని చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ సమావేశంలో వెల్లడించారు.

ధాన్యం కొనుగోలుకు.. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. 

  సర్వసభ్య సమావేశంలో రెండవ అంశమైన వ్యవసాయంపై  కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పద్మావతి మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోవడంతో కొంతమేర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని అయితే అనూహ్యంగా వర్షం కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని, ప్రస్తుతం రైతాంగం వరి కోతలకు సిద్ధమైనట్లు తెలియజేస్తుండగా మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) జోక్యం చేసుకుని, అమ్మా.. వర్షం కురవడంతోపాట ప్రభుత్వం సకాలంలో స్పందించి పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల నుంచి సాగునీటిని మ్యాచ్ చేసుకుంటూ రైతన్నలకు ఎటువంటి వ్యవసాయ కష్టం కలగకుండా సాగుకు నీళ్లు వదిలారన్నారు. ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోకపోతే జిల్లాలో వ్యవసాయం పూర్తిగా చతికెలపడేదన్నారు. 

అనంతరం జిల్లా పౌర సరఫరాల శాఖ డి ఎం శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలోని 317 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏడాది పంట దిగుబడి ఎంతో ఆశాజనకంగా ఉందని, దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఒక డిప్యూటీ తాహిసిల్దార్ , ఆరుగురు హమాలీల బృందాన్ని ఏర్పాటు చేశామని మొత్తం ఒక కోటి 70 లక్షల గోనె సంచులు అవసరం కాగా, ఇప్పటివరకు నాణ్యత గల 16 లక్షల 76 వేల గోనె సంచులను సేకరించినట్లు ఆయన తెలిపారు.రైతు భరోసా కేంద్రాల వద్ద మిల్లర్ల వద్ద తేమ శాతం లో తేడాలు వస్తే రైతులు నష్టపోకుండా ఈ ఏడాది మొబైల్ టెక్నికల్ టీంలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడైనా తేమ శాతంలో తేడాలు వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే తేమ శాతం నిర్ధారించేందుకు ఈ మొబైల్ టీంలు ఉపయోగపడతాయని సివిల్ సప్లై డిఎం  తెలిపారు.

తర్వాత జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లకు ఆర్‌బికెలో పూర్తిస్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే అన్ని ఆర్‌బికెల్లో ధాన్యం కొనుగోలుకు కావాల్సిన మెటీరియల్‌ అందజేయడం జరిగిందని, అధికారులు సంబంధిత సిబ్బందితో క్షేత్రస్థాయిలో లోటుపాట్లను గుర్తించి సరిచేయాలని అన్నారు. క్షేత్రస్థాయి సమస్యల తక్షణ పరిష్కారం కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌కాల్‌ చేసి సరి చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి తేమ శాతం, టోకెన్స్‌ జారీ, నాణ్యతా ప్రమాణాలు తదితర వాటిపై సిబ్బందితో ప్రాక్టికల్‌గా చేయించామన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా స్నేహపూరిత వాతావరణంలో అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు. రైతులు పంట కోసే మూడు రోజుల ముందు వారికి కావాల్సిన గోనె సంచులు అందజేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తగినన్ని గోనె సంచులు నిల్వ ఉంచుకోవాలని, ఎక్కడా గోనె సంచుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా పని చేయాలన్నారు. ఖరీఫ్‌ సాగుకు ఎక్కడా నీటి కొరతలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.



ఈ సమావేశంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఏలూరు ట్రైనీ కలెక్టర్ టి శ్రీ పూజ, ఏలూరు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల జడ్పిటిసిలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు


Comments