మంగళగిరి అంటే ఎమ్మెల్యే ఆర్కేకు ఏటీఎం…ఎనీ టైం దోచుకోవడమే ఆర్కే పని.

 *నందం అబద్దయ్యను ఆర్కే బెదిరించడాన్ని ఖండించిన టీడీపీ నేతలు*


*కరకట్ట కమలహాసన్ కు భారీ ఎత్తున డబ్బులు ముట్టడంతోనే బూదాటికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి*


*మంగళగిరి అంటే ఎమ్మెల్యే ఆర్కేకు ఏటీఎం…ఎనీ టైం దోచుకోవడమే ఆర్కే పని*



*ఇప్పటికే వందలాది కోట్ల అవినీతికి పాల్పడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి*


*అభివృద్ది గోరంత.. అవినీతి కొండంత*


*బీసీల సత్తా 2024 ఎన్నికలలో ఆర్కేకు చూపిస్తాం* 


మంగళగిరి టౌన్, నవంబరు 29 (ప్రజా అమరావతి): మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్యను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి బెదిరించడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆర్కే బెదిరింపుల పట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ ఆర్కే ఫోటో షూట్లకు తెరదించి.. టీడీపీ నాయకుల పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. నందం అబద్దయ్య బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ప్రతి సారి ఆర్కేతో పాటు అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ ఓట్లతో గెలిచిన ఆర్కే అదే బీసీలను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరుడు దాసరి వీరయ్య బెదిరిస్తే ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యేనే నాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వందల కోట్ల అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే ఆర్కే శాసనసభ్యుడుగా అనర్హుడని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో సహజ వనరులను ఆర్కే బినామీ పేర్లతో కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపు, మట్టి మాఫియాతో పాటు తాజాగా కొండలను సైతం పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.


గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సాహితీ కనస్ట్రక్షన్ కంపెనీ ఎండీ బూదాటి లక్ష్మినారాయణ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి భారీ ఎత్తున డబ్బులు తీసుకొని 2021 సెప్టెంబరులో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇప్పించారన్నారు. ఇదే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు,  మృదు స్వభావి అయిన నందం అబద్దయ్య స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్రమాలు, సాక్షి పత్రిక అసత్యాలను ప్రశ్నిస్తే.. ఆయనను బెదిరించడం పిరికిపంద చర్య అన్నారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడటం అతని అహంకారాన్ని తెలియజేస్తోందన్నారు. మీ అవినీతిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డంపెట్టుకొని బెదిరిస్తారా అని ప్రశ్నించారు. నందం అబద్దయ్య ప్రెస్ నోట్‌కి ఖండన ఇవ్వాలి కానీ.. ఫోన్లు చేసి ఏ విధంగా బెదిరిస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరుడు దాసరి వీరయ్య నందం అబద్దయ్యకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. ఆ సంఘటనపై నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్‌ లలో ఫిర్యాదు చేయగా వీరయ్యపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బూదాటి లక్ష్మినారాయణ 2019 ఎన్నికలలో టీడీపీకి ఫండ్ ఇచ్చినట్లు సొంత పత్రిక సాక్షిలో అవాస్తవాలు రాసినట్లు తెలిపారు. సొంత పత్రిక ఉందని అవాస్తవాలు రాయడం తగదన్నారు. మరో సారి మా నాయకుల పట్ల బెదిరింపులకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. మంగళగిరిని అవినీతి కేంద్రంగా మార్చిన ఘనత ఆర్కేకు దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో ఆర్కేకు టికెట్ రాదని తెలిసే భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు


రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ 2019 ఎన్నికలలో నారా లోకేష్‌కు డబ్బులు ఇచ్చినట్లు సాక్షి పత్రికలో అసత్యాలు రాయడం సరైన పద్దతి కాదన్నారు. ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని మండిపడ్డారు. గతంలో టిడ్కో గృహాలలో అవినీతి జరిగిందని బీసీ, ఎస్సీ కౌన్సిలర్ల మీద కూడా ఎమ్మెల్యే ఆర్కే కేసులు పెట్టించారని విమర్శించారు. ఆ రోజు టిడ్కోలో అవినీతి జరిగిందని మీరు ఎవరిపైన ఆరోపణలు చేశారో.. ఇప్పుడే అదే వ్యక్తి అయిన గంజీ చిరంజీవితో కలిసి మీరు తిరుగుతున్నారంటే ఆనాటి నుంచే మీ ఇద్దరి మధ్య సత్సబంధాలు ఉన్నాయని అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యే అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలు అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని బీసీ సామాజికవర్గం మొత్తం ఎమ్మెల్యే పనితీరును చూస్తున్నారని, కచ్చితంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇకపై నియోజకవర్గంలో ఆర్కే రాజకీయ నాటకాలు సాగవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.


మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏటీఎం లాంటిదని పేర్కొన్నారు. ఏ అంటే ఆర్కే అని, టీ అంటే తాడేపల్లి అని, ఎం అంటే మంగళగిరి కాబట్టి తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ ను ఎనీ టైం దోచుకోవడమే ఆర్కే పని అని మండిపడ్డారు. ఆర్కేకు చిత్తశుద్ది ఉంటే మీరు చేసే అభివృద్ధిలో ఏ యొక్క కాంట్రక్టర్ పేరు అయిన చెప్పగలరా అని ప్రశ్నించారు. అధికారులతో రూ. 10 వర్కు చేయించి రూ.1000 వర్కు చేసినట్లు దోచుకోవడమే ఆర్కే పని అని విమర్శించారు. నారా లోకేష్ పై అవాస్తవాలు వ్రాసే సాక్షి పేపర్ పై పరువు నష్టం దావా వేసే హక్కు మాకు ఉంటుందన్నారు. అభివృద్ది చేసింది గోరంత అయితే దాని వెనుక అవినీతి అనకొండంత అని విమర్శించారు. అధికారులను అడ్డం పెట్టుకొని వందల కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. టిడ్కో గృహ మౌలిక సదుపాయాల పేరుతో బినామీ కాంట్రాక్టర్ లను పెట్టి పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే కోట్లు కొల్లగొట్టారు. గౌతం బుద్ధ రోడ్డులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మంగళగిరి డివైడర్ తొలగింపులో టెండర్ లేకుండా డివైడర్ మట్టి మాయం చేసి దోపిడికి పాల్పడ్డారన్నారు. చేనేతలు అంటే పోగు పోగు కలిపి వస్త్రం తయారు చేయడమే కాదు ఆ చర్నకోలు దెబ్బ ఏలా ఉంటుందో 2024 ఎన్నికలలో ఆర్కేకు చూపిస్తామన్నారు. మీడియా వారిని కూడా ఆర్కే బెదిరిస్తున్నారంటే మీ రౌడీయిజాం ఏమిటో అర్థమవుతుందన్నారు. 


మాజీ కౌన్సిలర్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్కే బీసీలను బెదిరించి ఓట్లు వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 74 మంది బీసీలను చంపిన ఘనత వైసీపీది అన్నారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవినీతిపరులు కాకపోతే సమాచార చట్టం ద్వారా మేము అడిగిన 25 ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉండవల్లి కొండను నామ మాత్రపు అనుమతితో వందల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. గిరి ప్రదిక్షణ పేరుతో కొన్ని కోట్ల రూపాయల మట్టిని దోచుకెళ్ళారు. గౌతం బుద్ధ రోడ్డు వెడల్పుపై బినామీ కాంట్రాక్ట్ తో దోపీడి చేయించింది నిజం కాదా అని పశ్నించారు. మీరు నిజాయితీపరులు అయితే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోతం సంచి వేసుకొని స్కూలు వెళ్ళీన ఆర్కే ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారన్నారు. పెద్ద వయస్సు ఉన్న వ్యక్తిని బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోవడానికి ఎవరు లేరన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి రూరల్ మండల అధ్యక్షులు తోట పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Comments