అన్ని వర్గాలలోని నిరుపేదలకు సామాజిక, సాధికారతా సురక్షను కల్పించడమే లక్ష్యం.

 

కాకినాడ ,నవంబర్ 14 (ప్రజా అమరావతి);


అన్ని వర్గాలలోని నిరుపేదలకు సామాజిక, సాధికారతా సురక్షను కల్పించడమే లక్ష్యం


గా రాష్ట్రంలో బుధవారం నుండి సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  తెలిపారు. 


      మంగళవారం  కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో  నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి వేణుగోపాల కృష్ణ  జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభిస్తున్న సమగ్ర కులగణన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  వెనుక బడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాలలోని పేదలకు విద్య, సంక్షేమం, నివాసం వంటి అంశాలలో  ప్రాధాన్యత కల్పించే దిశగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కుల గణన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని తెలిపారు.  గత ఏప్రియల్ 11వ తేదీన మహాత్మా జ్యోతీభా పూలే జయంతి సందర్భంగా 139 బిసి కులలాతో పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనాటీ వర్గాలు,  ఉన్నత వర్గాలలో పేదరికంలో మగ్గుతున్న కులాలను గుర్తించి వారి సంక్షేమం, అభ్యున్నతి ప్రణాళికల రూపకల్పన చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమగ్ర కుల గణన కార్యక్రమ నిర్వహణకు నిర్ణయం ప్రకటించారని తెలిపారు. ఇందుకనుణంగా ఈ కుల గణన ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుండి పవిత్రమైన కార్తీక మాసంలో సమున్నత ఆశయంతో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలుత 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పైలెట్ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టి, నిర్వహణ, విధాన పరమైన అంశాలను క్రోడీకరించి రాష్ట్రమంతటా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.  జాయింట్ కలెక్టర్లు నోడల్ అధికారులుగా  వ్యవహరిస్తూ  ఈ నెల 15, 16 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని కులాలకు చెందిన పెద్దలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులు సంఘాల నేతలు, ప్రతినిధుల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తారని, వీటిని కుల గణన కార్యక్రమంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.  అలాగే కుల గణన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఈ నెల 17వ తేదీన రాజమహేంద్రవరం, కర్నూలులలోను, 20వ తేదీన విశాఖపట్నం, విజయవాడలలోను, 24వ తేదీన తిరుపతిలోను ఈ సదస్సులు  జరుగతాయని మంత్రి తెలియజేశారు.  నవరత్న ప్రాధాన్యతా కార్యక్రమాల ద్వారా పేదలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాంధవుడిగా నిలిచారని, కుల గణన సమచారంతో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలతో పాటు ఉన్నత వర్గాలలో పేదరికాన్ని అనుభవిస్తున్న కులాలకు కూడా సంక్షేమ ఫలాలను అందించేందుకు వీలుకానుందన్నారు.  అన్ని కులాల సమాన స్థాయిని సాధించి, సామాజిక న్యాయానికి ఆంధ్రపదేశ్ చిరునామాగా నిలువబోతోదన్నారు.  బిసి సంక్షేమ మంత్రిగా ముఖ్యమంత్రి సదాశయ సాధనలో ఆయన వెంట నడుస్తూ ఈ బృహత్తర, చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనడం తన అదృష్టమని మంత్రి  వేణుగోపాల కృష్ణ  సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సమగ్ర కుల గణన కార్యక్రమంలో అన్ని కులాల, వర్గాల ప్రజలు చైతన్యవంతంగా పాల్గొని, ఆదర్శ సమ సమాజ సాధనలో భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 


Comments