మానసిక, శారీరక స్ధిరత్వానికి ఆలంబన క్రీడారంగం.

 *మానసిక, శారీరక స్ధిరత్వానికి ఆలంబన క్రీడారంగం *సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి* 


 *26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్సు, గేమ్స్ మీట్ గోడపత్రిక ఆవిష్కరణ* 


 *డిసెంబర్ 5 నుండి 9 వరకు ప్రాంతీయ స్పోర్ట్సు మీట్ లు* 


 *జనవరి 4 నుండి 6 వరకు అనంతపురం వేదికగా రాష్ట్ర స్ధాయి క్రీడా సంబరం* 


విజయవాడ (ప్రజా అమరావతి): పట్టుదల, సహనం గురించి జీవితంలో అత్యంత విలువైన పాఠాలను బోధించేది ఒక్క క్రీడా రంగం మాత్రమేనని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి అన్నారు. మానసిక, శారీరక స్ధిరత్వానికి క్రీడారంగం ఆలంబనగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర స్దాయిలో పాలిటెక్నిక్ విద్యార్ధుల కోసం ప్రతి  సంవత్సరం నిర్వహించే 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్సు అండ్ గేమ్స్ మీట్ 2023–2024 గోడపత్రిక ను బుధవారం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనరేట్ లో చదలవాడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ రానున్న సంవత్సరం జనవరి 4 నుండి 6వ తేదీ వరకు  అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఈ క్రీడా వేడుక నిర్వహిస్తామన్నారు. మరోవైపు  ఈ సంవత్సరం డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ స్పోర్ట్సు అండ్ గేమ్స్ మీట్ లు వివిధ ప్రాంతాల్లో జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లలో యువ అథ్లెట్ల ప్రోత్సహిస్తూ,  విద్యార్థులలో నిజమైన నాయకత్వ,  క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా కార్యక్రమానికి రూపకల్పన చేసామన్నారు. జాతీయ అత్యవసర సమయాల్లో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు విద్యార్థులను శారీరకంగా దృఢంగా, సామాజికంగా అప్రమత్తంగా ఉండేందుకు క్రీడలు దోహదం చేస్తాయని కమీషనర్ పేర్కొన్నారు.  కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు వి పద్మారావు,  ప్రాంతీయ సంయిక్త సంచాలకులు నిర్మల్ కుమార్ ప్రియ, సత్య నారాయణ మూర్తి, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి రమణ బాబు, సంయిక్త కార్యదర్శి జానకి రామయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments