ఆంధ్రా సన్న బియ్యానికి డిమాండు ఎక్కువ.

 *ఆంధ్రా సన్న బియ్యానికి డిమాండు ఎక్కువ


*

*•తెలంగాణాలో లావు రకం ధాన్యం పండుతుంది, నూక శాతం ఎక్కువగా ఉంటుంది*

*•హైద్రాబాదు, చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు ఆంధ్రా సన్న బియ్యాన్నే తింటున్నారు*

*•రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది*

*•రెండు మూడు రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేయడం జరుగుచున్నది*

*•రాష్ట్ర పౌర సరఫరాల శాఖను దేశంలోనే అత్యుత్తమైన శాఖగా తీర్చిదిద్దాం*

*రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు*


అమరావతి, నవంబరు 3 (ప్రజా అమరావతి): ఆంధ్రా సన్న బియ్యానికి  చుట్టు ప్రక్కల  రాష్ట్రాల్లో మంచి డిమాండు ఉండటం వల్ల పోటీపడి మరీ ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకోవడం జరుగుచున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.  ప్రత్యేకించి తెలంగాణాలో లావు రకం ధాన్యం పండుతుందని, నూక శాతం కూడా ఎక్కువగా ఉండటం వల్ల,  హైదరాబాదు చుట్టు ప్రక్కల ప్రజలు ఆంధ్రా సన్న బియ్యాన్నే తినడం జరుగుచున్నదన్నారు.  శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ  ఈ మధ్య కాలంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంద్రా బియ్యాన్ని మేమే కొనుగోలు చేస్తున్నామని చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే సకాలంలో కొనుగోలు చేసి  రెండు మూడు రోజుల్లోనే చెల్లింపులు చేయడం జరుగుచున్నదని తెలిపారు. ప్రస్తుత సీజన్ లో దాదాపు 37 లక్షల  మెట్రిక్ టన్నుల  ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందని, అయితే ఇప్పటి వరకూ  రూ.1.50 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి  రెండు మూడు  రోజుల్లోనే చెల్లింపులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్టం ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పౌర సరఫరాల శాఖను  దేశంలోనే అత్యుత్తమమైన శాఖగా తీర్చిదిద్దం జరిగిందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో  రేషన్ డిపోల ద్వారా సాధారణ బియ్యాన్ని, గోదుములను మాత్రమే సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు. అయితే మన రాష్ట్రంలో  సార్టెక్స్ సన్నబియ్యం, కందిపొప్పు, గోదుమ పిండి,  పంచదార మరియు ప్రత్యేకించి  ఉత్తరాంద్రాలో రాగులు, జొన్నలను కూడా సరఫరా  చేయడం జరుగుచున్నదన్నారు. అంతే కాకుండా  దేశంలో ఎక్కడా లేని విధంగా  వాహనాల ద్వారా  రేషన్ సరుకులను ప్రజల ఇళ్ల ముందే సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు.  


అదే విధంగా రాష్ట్రాన్ని గత నాలుగు న్నర్రేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ది పర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.  కరోనా సమయంలో ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడారని, ఆ సమయంలో దేశమంతా  ఆంధ్ర రాష్ట్రం వైపే చూసిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో  పలు సంస్కరణలతో పాటు వినూత్న పధకాలను అమలు పర్చారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షా పథకాన్ని బ్రహ్మండంగా అమలు చేయడం జరుగుచున్నదని, ఆరోగ్యశ్రీ పథకం క్రింద చికిత్సలు చేసే  వ్యాధులను పెద్ద ఎత్తున పెంచడమే కాకుండా   సంబందిత ఆసుపత్రులకు మూడు నెలల్లోనే చెల్లింపులు చేయడం జరుగుచున్నదన్నారు. ప్రతి జిల్లాల్లోనూ వైద్య  కళాశాలలను నిర్మించడమే కాకుండా ఆధునాతన వైద్య సేవలను సాదారణ ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.  విద్యా రంగానికి సంబందించి గతంలో  15 వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని  3 వ స్థానానికి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడే స్థాయికి తీసుకు రావడం జరిగిందన్నారు. దాదాపు రూ.55 వేల కోట్లు వెచ్చించి 31 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 7.50 లక్షల పైనే ఇళ్లు కట్టించడం జరిగిందని, మరో కొన్ని లక్షల ఇళ్ల నిర్మాలను చేపట్టడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో గతంలో  ఉన్న 11.10 పేదరిక శాతాన్ని 6 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తదుపరి  ఎన్నో ఆర్థిక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఎంతగానో కృషిచేయడం జరుగుచున్నదన్నారు. 

                                                                                                                                                                                                   

Comments