*ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప?*
*-తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే*
*-చట్టబద్ధంగా పరిపాలించేందుకే ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు*
*- దోపిడీలు చేస్తామంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.*
*-మంగళగిరి నియోజకవర్గానికి రూ.1200కోట్లు నిధులు మంజూరు చేస్తామని చివరకు రూపాయి బిళ్ళ విడుదల చేయని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.*
*- ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి?*
*- సర్వస్వం పోగొట్టుకుని వైఎస్సార్ సీపీ కి ఎంతో సేవ చేశా.*
*- నైతిక విలువలు పాటిస్తూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశా.*
*- షర్మిలమ్మ తోనే నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది.*
*-ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK)*
మంగళగిరి. (ప్రజా అమరావతి):
ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప అని, తప్పు ఎవరు చేసినా తప్పు తప్పేనని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) అన్నారు. నగరంలోని ఆటోనగర్ లో గల తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మంగళగిరి ప్రజలు తనను ఆశీర్వదించారని, కాబట్టే ఐదేళ్లు ప్రతిపక్షంలోనూ, నాలుగున్నర యేళ్లు పాలక పక్షంలో ఎమ్మెల్యే గా కొనసాగానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1200 కోట్ల నిధులు కేటాయిస్తామని చెబితే చాలా సంతోషించానని, అయితే ఆ సందర్భంలో కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో వేచి చూశామన్నారు. తరువాత రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో రూ.1200 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి పలు మార్లు సమీక్షలు నిర్వహించి రూ. 500కోట్లకు కుదించారన్నారు. మరలా రూ. 350కోట్లకు కుదించినా చివరకు రూ.120 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో పైసా కూడా లంచం లేకుండా అధికారులు, కాంట్రాక్టర్ల సహకారంతో గడిచిన 40-50 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.120కోట్ల నిధులకు గానూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక సుమారు రూ.7- రూ. 8కోట్ల ను బయట అప్పులు తీసుకువచ్చి చెల్లించానని గుర్తు చేశారు. తన సొంత డబ్బులతో ఎన్ని అభివృద్ధి పనులు చేశానో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, అయినా నేటికీ బిల్లులు రాకపోవడం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల్లో లోకేష్ అంతటి వ్యక్తిని ప్రజలు ఓడించారని, మంగళగిరి ప్రజలు తిరిగి వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టాలంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకరించకపోతే ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగాలని ప్రశ్నించారు. ఎవరిని నిందించాల్సిన అవసరం తనకు లేదని, చాలా బాధ పడ్డా...ఇబ్బందులు పడి సర్వస్వం పోగొట్టుకుని వైఎస్సార్ సీపీ కి ఎంతో సేవ చేశానని గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో కూడా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే ఏమని పనిచేయగలుగుతాం... ఏమని ప్రజల దగ్గరకు వెళతాం... బహుశా నేను ఈవేళ రాజకీయాలకు సరిపోనేమో అనే భావించి నైతిక విలువలు పాటిస్తూ నియోజకవర్గ ప్రజలు క్షమించాలని కోరుకుంటూ ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ సీపీ పార్టీకి స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేయడం జరిగిందన్నారు. తాను తిరిగి వైఎస్సార్ సీపీలోకి వెళ్లే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుట పార్టీని ఓడించాలని అనుకోవడం సహజమని, అయితే అందుకు కొన్ని సిద్ధాంతాలు ఉండాలన్నారు. ప్రధానంగా మంగళగిరి, కుప్పం, పులివెందుల, గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో దేశం పార్టీ అభ్యర్థులను ఓడించాలంటే ప్రజలకు పనిచేయడంతో పాటు అయ్యా నియోజకవర్గాల అభ్యర్థులను కాపాడుకోవాలన్నారు. నిరంతరం ప్రజల దగ్గరకు వెళ్లే అభ్యర్థులకు అండగా ఉండాలని అయితే అలాంటి పరిస్థితులు లేవన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకున్న వారు కాబట్టే గత 2019 లోకేష్ ను ఓడించారని, తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. సంక్షేమం- అభివృద్ధి రెండూ రెండు కళ్ళు అని చెప్పుకునే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం అనే ఒక కంటికి వెలుగునిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు ఇవ్వకపోతే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో నియోజకవర్గ పరిస్థితి కూడా అంతే ఉంటుందన్నారు. తాను ఒక్కటైతే కచ్చితంగా చెప్పగలనని, తాను వైయస్ రాజశేఖర రెడ్డి మనిషినని, వైఎస్ రాజశేఖరరెడ్డి భక్తుడినని, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిని అన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టనని, షర్మిలమ్మతో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. ఆమె తీసుకునే నిర్ణయానికి తాను అనుగుణంగా కలిసి పని చేస్తానన్నారు. చంద్రబాబుపై తాను వేసిన కేసుల విషయమై ఎమ్మెల్యే ఆర్కే స్పందిస్తూ తాను ఎక్కడ ఉన్నా కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా రూ.5 కోట్లకు అవసరంలేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో, వీడియో ల ద్వారా దొరికిన పరిస్థితి ప్రపంచం చూసిందన్నారు. చంద్రబాబు హయాంలో ఆ నాటి టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులపై తాను ఎక్కడ ఉన్నా కేసులు కొనసాగుతాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే గొప్పా? తప్పు చేసిన మహామహులే న్యాయస్థానాల మెట్లు ఎక్కి శిక్షలు అనుభవించారని, ముఖ్యమంత్రి ప్రధానమంత్రా అనే తేడా ఉండదు అన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఇక తన హయాంలో చేపట్టి తుది దశకు చేరుకున్న అభివృద్ధి పనులు కొనసాగుతాయని, ముఖ్యంగా చేనేత బజార్ , కోనేరు మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
addComments
Post a Comment